ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారంతో ముగిశాయి. తొలి రోజున గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ అధినేత వైైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా ఆ పార్టీకి చెందిన 11 మంది సభ్యులు సభకు హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం మొదలు కాగానే సభ నుంచి వెళ్లిపోయారు. పోతూపోతూ సభకు హాజరైనట్టుగా రిజిష్టర్లలో సంతకాలు చేసి మరీ వెళ్లిపోయారు. అంతే..ఆ తర్వాత వారెవరూ సభకే రాలేదు. అయినా కూడా వారిలో కొందరు సభకు హాజరైనట్లుగా రిజిష్టర్లలో సంతకాలు ఉండటం గురువారమే బయటపడింది. దీనిపై సభా నాయకుడి స్థానంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనదైన శైలి సెటైర్లు సంధించారు.
గురువారం సభ ప్రారంభం అయిన వెంటనే అసెంబ్లీ స్పీకర్ వైైసీపీ ఎమ్మెల్యేల దొంగ సంతకాల విషయాన్ని ప్రస్తావించారు. ఆ తర్వాత సభ ముగిసే సమయానికి కాస్తంత ముందుగా చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించారు. రిజిష్టర్ వివరాలు తెప్పించుకుని మరీ ఆయన వైసీపీ బండారాన్ని బయటపెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఏమన్నారంటే… ”24వ తారీఖున వైసీపీ వారు 11 మంది వచ్చారు. 25న ఐదు మంది వచ్చారు.18.3.2023న ఒకరు వచ్చారు. 19.3.2025న నలుగురు వచ్చారు. అయితే లోపల ఎక్కడా వారు వచ్చినట్లు కనిపించలేదు. మీరు రానివ్వలేదా? మాకు ఐడియా లేదు. మీరు రానివ్వలేదేమోనని మా అనుమానం” అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.
చంద్రబాబు వ్యాఖ్యలతో సభలో నవ్వులు విరియగా… ఆ తర్వాత చంద్రబాబు వ్యాఖ్యలకు వివరణ ఇచ్చే బాధ్యతను స్పీకర్ అయ్యన్నపాత్రపుడు తీసుకున్నారు. ప్రజా ప్రతినిదులుగా ఎన్నికైన వారు ఎమ్మెల్యేలుగా ప్రభుత్వం నుంచి వేతనాలు తీసుకుంటున్నారని తెలిపారు. అలా సర్కారీ వేతనాలు తీసుకుంటూ సభకు రాకుంటే ఎలాగంటూ ఆయన ప్రశ్నించారు. ఈ తరహా వ్యవహారంపైనా చర్చించి కఠిన దండన ఉండేలా చర్యలు చేపట్టక తప్పదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఓ సభ్యుడు ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేద్దామనగా.. ఆ విషయాన్ని కూడా పరిశీలిద్దామని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా చంద్రబాబు చమక్కులు, అయ్యన్న హెచ్చరికలతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి.