కార్యకర్తకు టీడీపీ భరోసా… ఇకపై ప్రతి బుధవారం…

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలో ఉన్నా… సీఎం నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులోని పుంగనూరు పరిధిలో హార్డ్ కోర్ టీడీపీ కార్యకర్త హత్యకు గురయ్యారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులే ఈ హత్యకు పాల్పడ్డారని…వారిపై చర్యలు ఎప్పుడని టీడీపీ కేడర్ గొంతెత్తి నినదిస్తోంది. ఆ కేకలతో కూడిన వినతులకు ఎండ్ కార్డ్ వేస్తూ పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ గురువారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి బుధవారం చంద్రబాబు, లోకేశ్ సహా టీడీపీ నియోజకవర్గ ఇంచార్జీలంతా కార్యకర్తలతో భేటీ కావానున్నారు. కార్యకర్తల ఈతిబాధలను సాంతం విననున్నారు. సమస్యలపై వినతులను స్వీకరిస్తారు. ఆపై వాటిని పరిష్కరిస్తారు. ఆ నివేదికలను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపుతారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు.

ఆ మధ్య తిరుపతిలో పర్యటనలో లోకేశ్ ఓ విషయాన్ని చెప్పారు. ఇకపై తాను ఎక్కడికి వెళ్లినా… ముందుగా ఆయా ప్రాంతాలకు చెందిన పార్టీ కేడర్ తో సమావేశం అయిన తర్వాతే తన తదుపరి పర్యటన మొదలు అవుతుందని నాడు లోకేశ్ చెప్పారు. ఆ మాటను మిగిలిన వారు పెద్దగా పట్టించుకోకున్నా… లోకేశ్ మాత్రం పక్కాగానే అమలు చేస్తున్నారు. గురువారం నాటి పార్టీ ప్రకటనలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. పార్టీ కేడర్ కు అండగా నిలిస్తే తప్పించి పార్టీని నిలబెట్టుకోలేమన్న వాస్తవాన్ని లోకేశ్ చాలా త్వరగానే గుర్తించారని చెప్పక తప్పదు. ఇదే అంశంపై సుదీర్గంగా చర్చ జరగడం… పుంగనూరులో కార్యకర్త హత్య నేపథ్యంలో కార్యకర్తలకు భరోసా కల్పించాలన్న మాట గట్టిగా వినిపించింది.

అనుకున్నదే తడవుగా కేడర్ కు భరోసా కల్పించే దిశగా పటిష్ట చర్యలు చేపట్టాల్సిందేనని చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎంత కష్టమైనా ఈ నిర్ణయాన్ని పక్కాగా అమలు అయ్యేలా చూడాలనీ చంద్రబాబు తీర్మానించారు. పార్టీ అధినేత నుంచి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి బాధ్యుల వరకూ ఈ నిర్ణయాన్ని అమలు చేసి తీరాలని కూడా గురువారం కేంద్ర కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఏదేనీ కారణం వల్ల ఈ నిర్ణయాన్ని అమలుచేయని వారు అందుకు గల కారణాలను కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలని తెలిపింది. ప్రతి బుధవారం ఉదయం ప్రజా ఫిర్యాదులు, అటుపై మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా కేడర్ తో నియోజకవర్గ స్థాయి సమావేశాలను నిర్వహించాలని తీర్మానించారు. ఈ నూతన చర్యలతో కేడర్ లో పార్టీ అధిష్ఠానంపై నమ్మకం పెంపొందడం, పార్టీ అభివృద్ది కోసం మరింతగా శ్రమించడం సాధ్యం అవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.