ఏపీ రాజకీయాలంటేనే ఇటీవలి కాలంలో ఎక్కడ లేనంత మేర చర్చకు తెర లేపుతోంది. రోజుకో వింత పరిణామం, వినూత్న ఘటనలతో రసవత్తర రాజకీయానికి నిలయంగా మారిన ఏపీలో… ఇప్పుడు ఆ రాష్ట్ర చట్ట సభలు, అందులో సాగుతున్న శాసన వ్యవహారాలపైనా అమితాసక్తి కనిపిస్తోంది. అందులో భాగంగానే గురువారం ఓ వింత ఘటన ఏపీ అసెంబ్లీలో చోటుచేసుకుంది. సభకు రాకుండానే… అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు వైసీపీ సభ్యులు దొంగతనంగా రిజిష్టర్లలో సంతకాలు పెట్టేస్తున్నారట. ఈ విషయాన్ని అసెంబ్లీ స్పీికర్ చింతకాయల అయ్యన్నపాత్రుడే స్వయంగా వెల్లడించడం గమనార్హం.
మొన్నటి ఎన్నికల్లో అప్పటిదాకా 151 సీట్లతో బలంగా ఉన్న వైసీపీ 11 సీట్లకు పరిమితం అయిపోయింది. కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి. ఇదే విషయాన్ని ఆసరాగా తీసుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తమకు ప్రదాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామంటూ కీలక ప్రకటన చేశారు. ఈ క్రమంలో ఆరు నెలల పాటు వరుసగా సభకు గైర్హాజరైతే అనర్హత వేటు పడుతుందన్న అదికార పక్షం ప్రచారంతో జగన్ సహా మొత్తం 11 మంది వైసీపీ సభ్యులు సభకు వచ్చారు. ఆ రోజు రిజిష్టర్లో సంతకం చేసేసి వెళ్లిపోయారు. మళ్లీ ఆరు నలల తర్వాత కదా పరిస్థితి కదా అంటూ జగన్ లైట్ తీసుకున్నారు. అయితే జగన్ మాదిరిగా ఆ పార్టీ సభ్యులు మాత్రి దీనిని లైట్ తీసుకోలేకపోయారు.
ఈ క్రమంలో ఓ వైపు జగన్ ఆదేశాలు… మరోవైపు తమ సభ్యత్వాలపై వేలాడుతున్న అనర్హత కత్తి… ఫలితంగా వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు దొంగలుగా మారిపోయారు. దొంగలు అంటే… ఏదో దోచుకోవడం కాదులెండి. దొంగల మాదిరిగా ఎవరూ చూడకుండా రిజిష్టర్లలో సంతకాలు చేసి వెళ్లిపోవడమన్న మాట. ఇలాంటి వారి జాబితాలో ఎవరెవరు ఉన్నారంటే… తాటిపర్తి చంద్రశేఖర్ (ఎర్రగొండపాలెం), దాసరి సుధ (బద్వేల్), ఆకేపాటి అమర్ నాథ రెడ్డి (రాజంపేట), వై.బాలనాగిరెడ్ది (మంత్రాలయం), రేగం మత్స్యలింగం (అరకు), విశ్వేశ్వర రాజు (పాడేరు), విరూపాక్షి (ఆలూరు)లు ఉన్నారు. వీరు గవర్నర్ ప్రసంగానికి హాజరై సంతకాలు చేశారు. ఆ తర్వాత కూడా వీరు వేర్వేరు రోజుల్లో అసెంబ్లీకి వచ్చినట్లుగా సంతకాలు చేశారట.
అయినా తంతు ఎలా వెలుగు చూసిందన్న విషయానికి వస్తే… సమావేశాలకు నిత్యం గైర్హాజరు అవుతున్న వైసీపీ సభ్యులు… తమ నియోజకవర్గాలకు సంబందించిన అంశాలకు సంబందించి ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. ఈ ప్రశ్నలకు సమాదానాలను తయారు చేస్తున్న మంత్రులు.. వాటిని చెబుదామంటే మాత్రం ప్రశ్నలు అడిగిన వారు సభలో కనిపించడం లేదు. దీనిపై ఇదివరకే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అసలేం జరుగుతోందంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు గురువారం రిజిష్టర్లను తెప్పించుకుని పరిశీలించారట. ప్రమాణ స్వీకారం, గవర్నర్ ప్రసంగాలకు తప్పించి మరే రోజు కూడా సభకు రాని వైసీపీ ఎమ్మెల్యేలు… రిజిష్టర్లలో మాత్రం చాలా రోజులు సభకు హాజరైనట్టుగా సంతకాలను ఆయన గుర్తించారు. ప్రజల వద్ద ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలుగా వైసీపీ సభ్యులు గౌరవంగా సభకు రావాలని పిలుపునిచ్చారు. అయితే గెలిపించిన ప్రజలను అవమానాలపాలు చేసేలా ఇలా దొంగ సంతకాలు మాత్రం చేయొద్దని ఆయన వారికి సూచించారు.