పాత చంద్రబాబును చూస్తారు.. 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారు
– అంటూ.. సీఎం చంద్రబాబు తరచుగా వ్యాఖ్యానిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఆయన ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు.. పెద్దగా ప్రజల నుంచి స్పందనరాలేదు. కానీ… తాజాగా పాత పథకాలను తీసుకువస్తున్నట్టు ప్రభుత్వం సంకేతా లు ఇచ్చింది. గతంలో 1995, 2014లో చంద్రబాబు పాలనా కాలంలో అమలు చేసిన కొన్ని పథకాలు ప్రజల ఆదరణ పొందాయి. వీటిని తర్వాత ప్రభుత్వాలు నిలిపివేశాయి.
ఇలాంటి వాటిలోనే అన్న క్యాంటీన్లు
ఒకటి. అదేవిధంగా చేతి వృత్తుల వారిని ఆదుకునే ఆదరణ
వంటి కీలక పథకాలు ఉన్నాయి. ఇప్పుడు కూటమి సర్కారులో అన్న క్యాంటీన్లు తొలి రెండు మాసాల్లోనే ఏర్పా టు చేశారు. ఇక, తాజాగా మరో రెండు కీలక పథకాలను కూడా తీసుకువచ్చేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటిలో మెజారిటీ ప్రజలకు మేలు చేసే.. ఆదరణ
కీలకంగా మారింది. కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి అవసర మైన వస్తువులను 90శాతం సబ్సిడీపై అందజేయనున్నారు.
రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలో ఉన్న 1997-99 సంవత్సరంలో ఆదరణ-1, 2014-19లో ఆదరణ-2ను అమలు చేశారు. ఇప్పుడు తాజాగా ఈ పథకాన్ని తిరిగి అమలు చేయాలని ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే రెండు మాసాల్లో ఆదరణపై పూర్తిస్థాయి రోడ్ మ్యాప్‌ను రెడీ చేయనున్నారు. ఈ పథకం కింద 335 రకాల వృత్తిదారులకు వారికి అవసరమైన పరికరాలు అందజేయనున్నారు.
ఇదేసమయంలో సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ తోఫాలను కూడా వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. సో.. మొత్తంగా పాత బాబు కంటే.. పాత పథకాల ద్వారా ప్రజలమనసులు చూరగొనాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పెట్టిన అన్న క్యాంటీన్లకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుండడం గమనార్హం. మరిన్ని క్యాంటీన్లను కూడా త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నారు. ఇలా.. ఆదరణ-3 పేరుతో కులవృత్తులతో జీవిస్తున్న వేలాది మంది బీసీలకు అవసరమైన వస్తువులను అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.