ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో టీడీపీ సహా కొందరు జనసేన సభ్యులపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలా అయితే.. సభ నుంచి బయటకు వెళ్లండి! అని వ్యాఖ్యానించారు. దీంతో సభ్యులు ఉలిక్కిపడ్డారు. దీనిపై ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా.. డిప్యూటీ స్పీకర్ వ్యాఖ్యలపై మాత్రం విస్మయం వ్యక్తం చేశారు. దీంతో సభలో కొన్ని నిమిషాల పాటు మౌనం ఆవహించింది.
ఏం జరిగింది?
సోమవారం.. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో కొన్ని బిల్లులను ప్రవేశ పెట్టారు. అయితే.. అదేసమయంలో కొందరు సభ్యులు ఫోన్లలో మెసేజ్‌లు చూసుకుంటున్నారు. మరికొందరు చేతిని అడ్డు పెట్టుకుని ఫోన్లు మాట్లాడుతున్నారు. ఇంకొందరు చాటింగ్ చేస్తున్నారు. ఈ పరిణామాలను గమనించిన డిప్యూటీ స్పీకర్.. రఘురామరాజు.. సభ్యులను కఠినంగానే హెచ్చరించారు.
“అసెంబ్లీలో కొందరు సభ్యులు ఫోన్ మాట్లాడుతున్నారు. మరికొందరు చాటింగ్ చేస్తున్నారు. ఇది పవిత్ర మైన సభలో సరికాదు. అసెంబ్లీ ప్రజాస్వామ్యానికి ఒక పవిత్ర వేదిక. ఇక్కడి గౌరవాన్ని అన్ని సందర్భాల్లో రక్షించాల్సిన బాధ్యత సభ్యులపై ఉంటుంది” అని వ్యాఖ్యానించారు. దీనిపై ఇప్పటి వరకు సభ్యులకు సూచనలు చేయాల్సిన అవసరం రాదని తాను భావించినట్టు తెలిపారు. కానీ, సభ్యులు రోజు రోజు కు మాత్రం ఫోన్లలో మునిగి తేలుతున్నారని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలోనే ఇప్పుడు హెచ్చరించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. సభలో పోన్లు మాట్లాడడానికి వీల్లేదని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో అయితే.. ఫోన్లను లోపలికి తీసుకురానివ్వబోరని కూడా తెలిపా రు. కానీ, అసెంబ్లీలో అనుమతిస్తున్నామని చెప్పారు. ఫోన్‌లను సభ్యులు సైలెంట్‌లో పెట్టుకోవాలన్నారు. అంత అ్యతవసరంగా ఫోన్లు వినియోగించుకోవాల్సి వస్తే.. బయటకు వెళ్లి మాట్లాడాలని సూచించారు. లేకపోతే.. ఇకపై కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు.