అదేంటీ… సభకు రాకుండానే ప్రశ్నలు వేస్తున్నారా?

ఏపీ అసెంబ్లీలో ఓ వింత పరిస్థితి కనిపిస్తోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైపోయిన వైసీపీకి సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. అయితే సభలో అధికార కూటమి పక్షాన్ని మినహాయిస్తే… మిగిలింది ఒకే ఒక్క విపక్షం అయిన తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ హోదా వచ్చే దాకా సభకు వచ్చేది లేదని ఆయన ఆదిలోనే తేల్చేశారు. పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఒక సారి… ఆ తర్వాత నిర్ణీత రోజుల్లోగా సభకు రాకపోతే సస్పెన్షన్ వేటు పడుతుందన్న భావనతో ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజున జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వచ్చారు. ఆ తర్వాత వారు సభకే రావడం లేదు. అయినా గానీ… ఆయా అంశాలపై సభలో అధికార పక్షానికి వైసీపీ సభ్యులు ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు.

ప్రజా సమస్యలపై ప్రశ్నలు సంధించడం ప్రజా ప్రతినిధులుగా వైసీపీ సభ్యులది గురుతర బాధ్యతే. అయితే ఆ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడం, వాటిని పరిష్కరించే దిశగా అధికార పక్షంపై ఒత్తిడి తీసుకు రావడం, ఆయా శాఖల మంత్రులపై మరిన్ని ప్రశ్నలు సంధించి… ఆ సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాల్సిన గురుతర బాధ్యత కూడా వారిపై ఉంది కదా. తొలి బాధ్యతను నెరవేరుస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు రెండో బాధ్యతను మాత్రం విస్మరిస్తున్నారనే చెప్పాలి. ప్రశ్నలు అడిగిన సభ్యులు సభకు హాజరు కాకపోతే… ఆయా ప్రశ్నలకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చేసి మంత్రులు కూడా చేతులు దులుపుకునే అవకాశాలే ఎక్కువ కదా. అంటే.. ఆయా సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది కదా.

ఇలాంటి ఘటనే సోమవారం నాటి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న టీడీపీ నేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రస్తుతం ఏపీ కేబినెట్ లో కీలకమైన రవాణా శాఖతో పాటు యువజన, క్రీడల శాఖ మంత్రిగానూ కొనసాగుతున్నారు. రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలోని ఏదో శాఖకు సంబంధించిన ప్రశ్నను వైసీపీకి చెందిన ఓ సభ్యుడు సంధించారు. ఆ ప్రశ్న సోమవారం నాటి సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చింది. అయితే ప్రశ్నను సంధించిన సభ్యుడు సభలో లేకపోవడంతో ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చేసినట్టుగా భావిస్తున్నామంటూ డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణరాజు తదుపరి ప్రశ్నకు వెళ్లిపోయారు. అంతేకాకుండా ప్రశ్నించిన సభ్యుడు సభకు రాలేదని, ఇకపై వస్తారో, రారో కూడా తెలియదని కూడా రాజు ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఫలితంగా సదరు ప్రశ్న ఏ అంశానికి సంబంధించినది అన్న విషయం కూడా జనానికి తెలియకుండా పోయింది.