లోకేష్‌కు కీల‌క ప‌ద‌వి: మ‌హానాడు.. మామూలుగా ఉండేలా లేదే.. !

టీడీపీకి మ‌హానాడు అనేది ప్రాణ ప్ర‌దం. ఈ విష‌యంలో ఎలాంటి తేడా లేదు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అనేక సంస్క‌ర‌ణ‌ల‌కు పెద్ద‌పీట వేసిన పార్టీలో మ‌హానాడుకు అత్యంత ప్రాధాన్యం ఉంది. గ‌తంలో అన్నగారు ప్రారంభించిన ఈ సంస్కృతిని ప్ర‌స్తుతం చంద్ర‌బాబు వ‌ర‌కు అంద‌రూ పాటిస్తున్నారు. అయితే.. ఎప్ప‌టిక‌ప్పుడు.. కీల‌క ప్రాంతాల‌ను ఎంపిక చేసుకుని నిర్వ‌హించే మ‌హానాడుకు ఈ ద‌ఫా క‌డ‌ప వేదిక‌గా మార‌నుంది.

క‌డ‌ప‌లోనూ.. వైసీపీ అధినేత‌ జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లోనే మ‌హానాడును నిర్వ‌హించాలని నిర్ణ‌యించారు. అయితే.. వేదిక‌పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలావుంటే.. క‌డ‌ప‌లో ఎక్క‌డ నిర్వ‌హించినా.. మ‌హానాడుకు ఒక చ‌రిత్రను తొడిగిన‌ట్టే అవుతుంది. 45 సంవ‌త్స‌రాల పార్టీ చ‌రిత్ర‌లో తొలిసారి క‌డ‌ప‌లో నిర్వ‌హిస్తుండ‌డం ఇదే తొలిసారి. అంతేకాదు.. ఈ వేదిక‌గా.. పార్టీకి భ‌విత‌వ్యాన్ని మ‌రింత గ‌ట్టిగా తీర్చిదిద్దే వుద్దేశం కూడా క‌నిపిస్తోంది.

ఈ మ‌హానాడు వేదిక‌గానే.. నారా లోకేష్‌కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా టీడీపీని బ‌లంగా ముందుకు తీసుకువెళ్తున్న నారా లోకేష్‌కు కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్ష ప‌ద‌విని క్రియేట్ చేసి ఇస్తార‌ని.. పార్టీలో అత్యంత సీనియ‌ర్ నాయ‌కుడు ఒక‌రు వ్యాఖ్యానించారు. నిజానికి నాలుగేళ్ల కింద‌ట కూడా.. ఇదే మాట వినిపించింది. కానీ, అప్ప‌ట్లో సాకారం కాలేదు. ఈ ద‌ఫా ఖాయ‌మ‌ని తెలుస్తోంది.

అదేస‌మయంలో పాత త‌రం నాయ‌కుల‌ను ప‌క్క‌న పెట్టి యువ త‌రానికి ప‌గ్గాలు అప్ప‌గించే విష‌యంపైనా మ‌హానాడు వేదిక‌గా మార‌నుంద‌ని తెలుస్తోంది. నారా లోకేష్ ఇటీవ‌ల కాలంలో చెబుతున్న‌ట్టు 33 శాతం మంది యువ‌త కు అవ‌కాశం క‌ల్పిస్తామ‌న్న విషయం ఈ వేదిక నుంచే సాకారం అయ్యే అవ‌కాశం ఉంటుం దని తెలుస్తోంది. అదేస‌మ‌యంలో పార్టీ భ‌విత‌వ్యం.. 2047 వ‌రకుఅధికారంలో కొన‌సాగేందుకు అనుస‌రించాల్సిన వ్యూహాల‌ను కూడా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు.