జగన్ కు సాయిరెడ్డి తలనొప్పి మొదలైనట్టే!

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు వరుసగా కష్టాలు మొదలైపోతున్నాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం నుంచి తేరుకోకముందే… వైసీపీని వదిలి చాలా మంది కీలక నేతలు వైరి వర్గాల్లో చేరి ప్రత్యర్థులుగా మారిపోయారు. ఇప్పుడేమో… రాజకీయాలే వద్దంటూ సాగు చేసుకుంటానంటూ వైసీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన వేణుంబాక విజయసాయిరెడ్డి మొన్నటికి మొన్న జగన్ పద్దతి బాగోలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అదేదో బయటకు వచ్చారు కాబట్టి మాట్లాడారు అనుకుంటే…తాజాగా శనివారం సోషల్ మీడియా వేదికగా జగన్ ను ఉద్దేశించి ఓ ఆసక్తికర పోస్టును పెట్టారు. వెరసి జగన్ కు సాయిరెడ్డి కొత్త తలనొప్పిగా పరిణమించారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

కాకినాడ సీ పోర్టు వాటాల బదలాయింపు వ్యవహారంలో సీఐడీ విచారణకు హాజరైన సందర్బంగా విజయవాడలో మీడియాతో మాట్లాడిన సాయిరెడ్డి…జగన్ చుట్టూ ఓ కోటరీ ఉందని… దానిని దాటి జగన్ బయటకు రాలేకపోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా తనపైనే జగన్ అనుమానపడ్డారన్న సాయిరెడ్డి… జగన్ తీరుతోనే తాను రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వచ్చిందన్న అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో భారీ ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయన్న కోణంలోనూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ పోర్టులో వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, మద్యం కుంభకోణంలో కసిరెడ్డి రాజశేఖరరెడ్డిలు కీలక పాత్రధారులని కూడా ఆయన చెప్పేశారు. అయితే ఈ వ్యవహారాలు జగన్ కు తెలియవంటూ జగన్ ను కాస్తంత వెనకేసుకొచ్చినట్టే కనిపించారు.

అయితే శనివారం రాత్రి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులో జగన్ తీరు సాయిరెడ్డి ఓ రేంజిలో తులనాడారన్న వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ ను మహారాజుతో పోల్చిన సాయిరెడ్డి… ఆయన చుట్టూ ఉండే కోటరీని పూర్వ కాలంలో రాజుల చుట్టూ ఉండే కోటరీలతో పోల్చారు. నాడు రాజులు తమ చుట్టూ ఉన్న కోటరీల మాటలు విని రాజుతో పాటు రాజ్యాలు కూడా కాల గర్బంలో కలిసిపోయాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు జగన్ కూడా తన చుట్టూ ఉన్న కోటరీని దాటి బయటకు రాకపోతే…జగన్ కూడా రాణించలేరని, ఆయన పార్టీ వైసీపీ కూడా కాల గర్భంలో కలిసిపోక తప్పదన్న రీతిలో సెటైరిక్ కామెంట్లను చేశారు. కోటరీ కుట్రలను గమనించిన నాటి రాజులు..కోటరీకి తెలియకుండా మారు వేషంలో ప్రజల్లోకి వచ్చి కోటరీ చేస్తున్న దురాగతాలను తెలుసుకుని తన రాజ్యాన్ని రక్షించుకున్నాడని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు జగన్ కూడా ఆ తెలివైన రాజులా తన కోటను కాపాడుకుంటారా? లేదంటే పార్టీని కాలగర్బంలో కలిపేసుకుంటారా? అన్న అర్థం వచ్చేలా సంచలన వ్యాఖ్యలు చేశారు.