నిన్నటి జనసేన జయకేతనం మీటింగ్ సోషల్ మీడియాలో పెద్ద స్థాయి చర్చకే దారి తీసింది. ఇందులో పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో భాగంగా అనేక అంశాల మీద మాట్లాడాడు. ఆయన చేసిన కొన్ని కామెంట్లు వివాదాస్పదం అయ్యాయి. ముఖ్యంగా హిందీకి వ్యతిరేకంగా తమిళనాడులో జరుగుతున్న పోరాటం మీద పవన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో పాటు మరి కొన్ని కామెంట్ల మీద విస్తృత చర్చ జరుగుతోంది.
ఇవన్నీ పక్కన పెడితే.. జనసేనకు మిత్రపక్షం అయిన తెలుగుదేశం పార్టీ మద్దతుదారులకు ఈ మీటింగ్‌లో ఒక కామెంట్ తీవ్ర ఆగ్రహమే తెప్పించింది. ఐతే అది పవన్ చేసిన వ్యాఖ్య కాదు. ఆయన సోదరుడు, ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబు కామెంట్ అది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి జనసైనికులు, ప్రజలు మాత్రమే కారణమని.. ఇంకెవ్వరూ విజయానికి క్రెడిట్ తీసుకోవడానికి వీల్లేదని నాగబాబు పేర్కొనడం తీవ్ర వివాదానికే దారి తీసింది.
కూటమి ప్రభుత్వం సాఫీగా సాగిపోతున్న సమయంలో తెలుగుదేశం, జనసేన మధ్య చిచ్చు పెట్టే ఇలాంటి వ్యాఖ్యలు అవసరమా అంటూ నాగబాబు మీద టీడీపీ మద్దతుదారులు మండిపడుతున్నారు. పిఠాపురంలో పవన్ పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో ఎన్నో ఏళ్లుగా అక్కడ పనిచేసుకుంటున్న వర్మ తన సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. ఎన్నికలకు ముందు ఆయన్ని వెంటబెట్టుకునే పవన్ ప్రచారానికి వెళ్లారు. తన గెలుపును వర్మ చేతుల్లో పెడుతున్నట్లు కూడా వ్యాఖ్యానించారు. వర్మే పవన్‌ను గెలిపించాడని చెప్పలేం కానీ.. ఆయన పాత్ర కీలకం అనడంలో సందేహం లేదు.
ఐతే పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ఫస్ట్ లిస్ట్‌లోనే ఎమ్మెల్సీ ఇస్తామన్న చంద్రబాబు మాట నిలబెట్టుకోలేకపోయారు. అయినా సరే.. వర్మ నిరసన స్వరం వినిపించలేదు. బాబుకు ఉండే ఇబ్బందులు బాబుకు ఉంటాయంటూ కార్యకర్తలకు సర్దిచెప్పారు. వర్మకు పదవి ఇవ్వకపోవడంపై ఇప్పటికే ఆయన అనుచరులు, టీడీపీ మద్దతుదారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అదే సమయంలో నాగబాబు, సోము వీర్రాజు లాంటి వాళ్లకు ఎమ్మెల్సీ ఇవ్వడమూ వారికి నచ్చలేదు.
ఇలా అసంతృప్తిలో ఉన్న సమయంలో నాగబాబు చేసిన కామెంట్లు వారికి మరింత బాధ, కోపం తెప్పిస్తున్నాయి. వర్మ, తెలుగుదేశం కార్యకర్తలు పవన్ విజయం కోసం కష్టపడలేదా.. వారి కృషిని గుర్తించకపోగా.. ఇలా రెచ్చగొట్టేలా మాట్లాడ్డం ఏంటి అంటూ నాగబాబు మీద నిన్న రాత్రి నుంచి టీడీపీ క్యాడర్ పెద్ద ఎత్తున వ్యతిరేకతను చూపిస్తోంది. నాగబాబు లాంటి వాళ్లు ఇలాంటి వ్యాఖ్యలను నియంత్రించుకోకుంటే టీడీపీ, జనసేన మధ్య చిచ్చు తప్పదనిహెచ్చరిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates