పవన్ కు చంద్రబాబు, లోకేశ్ గ్రీటింగ్స్

జనసేనకు శుక్రవారం అత్యంత కీలకమైన రోజు. పార్టీ ఆవిర్భవించి శుక్రవారం నాటికి 11 ఏళ్లు పూర్తి కానున్నాయి.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఆ పార్టీ భారీ ఎత్తున ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తోంది. ఈ వేడుకలు ప్రారంభమవుతాయనగా… పవన్ కల్యాణ్ కు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పవన్ కు గ్రీటింగ్స్ చెబుతూ చంద్రబాబు, లోకేశ్ ఆసక్తికర సందేశాన్ని పోస్టు చేశారు.

జనసేనకు శుభాకాంక్షలు చెబుతూ చంద్రబాబు చేసిన పోస్టు ఆసక్తికరంగా సాగింది. జన సేవా నిబద్ధత, విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీకగా జనసేన కొనసాగుతోందని చంద్రబాబు ఇంటరెస్టింగ్ కామెంట్లు చేశారు. జనానికి చేసే సేవను ఆయన జన సేవ అంటూ జనసేనకు ఆపాదిస్తూ ఆ పద బంధాన్ని వాడారు. జనసేన 12 ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్, పార్టీ ముఖ్య నేతలు, జనసైనికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ చంద్రబాబు గ్రీటింగ్స్ చెప్పారు.

పవన్ ను అన్నా అంటూ సంబోధిస్తూ లోకేశ్ ఈ గ్రీటింగ్స్ ను చెప్పడం విశేషం. జనసేన 12వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా పవన్ అన్న, పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులకు హృదయపూర్వక అభినందనలు అని లోకేశ్ తెలిపారు. ఏపీ ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో జనసేన పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో జనసేన కృషి అభినందనీయమని కూడా లోకేశ్ పేర్కొన్నారు. పవన్ ను అన్నా అని సంబోధిస్తూ లోకేశ్ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.