గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఇప్పటికే పాలక మండలి కూడా రద్దయింది. ప్రత్యేక అధికారి పాలనలోకి కార్పొరేషన్ వెళ్లిపోయింది. దీంతో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. పట్టణ ప్రాంతాల్లో బీఆర్ ఎస్‌కు ఉన్న హవా.. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న బీఆర్ ఎస్ ప్రభావం వంటివాటిని అంచనా వేసుకున్న కాంగ్రెస్ పార్టీ.. దానికి చెక్ పెట్టేలా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తలు పాటిస్తున్నా రు.
అందులో భాగమేనా?
ఇటీవల మైత్రీవనంలో దివంగత సీఎం ఎన్టీఆర్ విగ్రహాన్ని సీఎంరేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అయితే.. ఏదీ కూడా ఊరికేనే చేయరన్న వాదన రాజకీయాల్లో వినిపిస్తుంది. అలానే.. రేవంత్ రెడ్డి ఈ విషయంలోనూ.. ఒకవైపు ఎన్టీఆర్‌పై అభిమానం చాటుతూనే.. మరోవైపు రాజకీయంగా తనకు కలిసి వచ్చే అంశాలను ఆయన పరిశీలన చేసుకుని.. దాని ప్రకారం ముందుకు సాగుతున్నారన్న చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు ప్రాధాన్యం ఇచ్చారు.
తద్వారా హైదరాబాద్ సహా.. గ్రేటర్ పరిధిలోని టీడీపీ అనుకూల ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. వాస్తవానికి కాంగ్రెస్‌కు-టీడీపీకి పెద్దగా ఎడమొహం లేదు. గతంలో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీడీపీ చేతులు కలిపి తెలంగాణలో పోటీ చేసింది. దీనికి పార్టీ కార్యకర్తలు కూడా సహకరించారు. ఇలానే.. ఇప్పుడు కూడా తమకు సహకరిస్తారన్న భావన సీఎం రేవంత్ రెడ్డిలో కనిపిస్తోంది. అందుకే.. ఆయన ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును సంపూర్ణంగా సమర్థించుకున్నారు.
మాస్ ఓట్లు..
గ్రేటర్ పరిధిలో చాలా వరకు మాస్ ఓటర్లు ఉన్నారు. పైగా సినీ, పారిశ్రామిక రంగాలకు చెందిన ఓట్లు కూడా ఉన్నాయి. వీరికి ఎన్టీఆర్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. హైదరబాద్‌ను డెవలప్ చేశారన్న కారణం ఒకటైతే.. సినీరంగానికే చెందిన నాయకుడిగా ఎన్టీఆర్‌ను చూస్తారు. ఇవన్నీ కూడా రేవంత్ అంచనా వేసుకున్నట్టు తెలుస్తోంది.
ఇక, రెండున్నరేళ్ల ప్రభుత్వ పాలనలో లబ్ధితోపాటు.. కొంత మేరకు ఉండే వ్యతిరేకతను ఎదుర్కొని.. గ్రేటర్‌హైదరాబాద్‌లో పార్టీ పాగా వేసేందుకు.. ఇది దోహద పడుతుందన్న ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates