ప్రేమలు 2 ఆపేయడం మంచిదే

మలయాళంతో పాటు తెలుగులోనూ మంచి విజయం సాధించిన మూవీ ప్రేమలు. దీంట్లో జంటగా నటించిన నస్లెన్, మమిత బైజు ఎంత బిజీ ఆర్టిస్టులు అయిపోయారో చూస్తున్నాం. అయితే ప్రేమలు 2 ని తీయాలని నిర్మాతలు ఆ టైంలోనే ఫిక్స్ అయ్యారు. దానికి అనుగుణంగా ప్రకటన ఇచ్చారు. ప్రమోషన్లు చేశారు. షూటింగ్ ప్రారంభం కాకుండానే హడావిడి చూపించారు. అయితే తాజాగా ప్రేమలు 2ని క్యాన్సిల్ చేస్తున్నామని, సీక్వెల్ ఆలోచన విరమించుకున్నామని నిర్మాతలు తేల్చేశారు.

ఒకరకంగా ప్రేమలు 2 ఇప్పుడు తీయకపోవడమే మంచిది. ఎందుకంటే మమిత బైజులో మునుపటి టీనేజ్ టింజ్ లేదు. సినిమాలు చేసే కొద్దీ తనలో లుక్స్ పరంగా మార్పులు వచ్చేశాయి. అందులోనూ సీరియస్ పాత్రలు ఎక్కువ చేయడం వల్ల ఇకపై తనను కాలేజీ అమ్మాయిగా లేదా అప్పుడే ఉద్యోగంలో చేరిన టెకీగా చూడటం కష్టం. అటువైపు నస్లెన్ కూడా కాల్ షీట్స్ ఇచ్చే పరిస్థితిలో లేడు. వరస కమిట్ మెంట్లతో డేట్స్ అడగొద్దు అంటున్నాడట.

ఇవన్నీ పక్కనపెడితే అసలు స్క్రిప్ట్ సరిగా రావడం లేదట. అనుకున్న స్థాయిలో ఫన్ కుదరకపోవడం వల్ల ప్రేమలు 2ని పక్కన పెట్టాల్సి వచ్చిందని, కేవలం క్రేజ్ ఉందన్న కారణంతో ఇష్టం వచ్చినట్టు తీస్తే ఫ్లాప్ అవుతుందని భావించి తప్పుకోవడం మంచి నిర్ణయమే. అయినా బాహుబలి, కెజిఎఫ్, పుష్ప, కాంతార లాంటి వాటికీ సీక్వెల్స్ అంటే ఓకే కానీ మరీ ప్రేమలు లాంటి రామ్ కామ్స్ కి బలవంతంగా పార్ట్ 2లు తీయడం అంత కరెక్ట్ కాదు.

గత కొన్నేళ్లలో సీక్వెల్ ఫీవర్ దర్శకుల్లో బాగా పెరిగిపోయింది. అవసరం ఉన్నా లేకపోయినా శుభం కార్డులో పార్ట్ టూ అని వేసేసి కృత్రిమ హైప్ కోసం ప్రయత్నిస్తున్నారు. కళ్యాణ్ రామ్ డెవిల్, సమంత యశోద, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు లాంటి ఎన్నో సినిమాలు మొదటి భాగం దగ్గరే ఆగిపోయాయి తప్పించి మళ్ళీ వాటి ఊసు లేదు. ఓజి 2 కూడా ఎప్పుడు ఉంటుందో సుజిత్ చెబితే తప్ప క్లారిటీ రాదు. ఏదైతేనేం ప్రేమలు కథ ఇక్కడితో సుఖాంతమయ్యింది.