రోమాంచకంకు సందీప్ వంగా స్టాంపు

తెలుగులోనే కాదు అటు హిందీలోనూ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లిస్టులో ఉన్న పేరు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ముఖ్యంగా యానిమల్ తర్వాత తన స్థాయి ఎక్కడికో వెళ్ళిపోయింది. స్పిరిట్ మీద ఇంత హైప్ రావడానికి ప్రభాస్ పేరు ఎంత కారణమో అంతే క్రెడిట్ సందీప్ వంగాకు కూడా దక్కుతుంది. అయితే ఇంత ఇంటెన్స్ గా ఆలోచించి కథలు రాసుకునే ఈ కల్ట్ దర్శకుడిని వేరొకరు స్టోరీ చెప్పి ఒప్పించడమంటే సంథింగ్ స్పెషల్ అనుకోవాలి. అదే రోమాంచకం .

సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న లవ్ కం రొమాంటిక్ థ్రిల్లర్ ఇవాళ అధికారికంగా ప్రకటించారు. షూటింగ్ ఆల్రెడీ మొదలైపోయినా దీనికి సంబంధించిన వివరాలు గుట్టుగా ఉంచుతూ వచ్చారు. సందీప్ వంగ సమర్పకుడిగా వ్యవహరించగా ప్రణయ్ వంగా నిర్మాతగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. స్పిరిట్ అంతకు ముందు యానిమల్ లోనూ వీళ్ళ నిర్మాణ భాగస్వామ్యం ఉన్న సంగతి తెలిసిందే.

ఖచ్చితంగా సందీప్ స్టాంప్ ఈ రోమాంచకంకు బాగా ఉపయోగపడుతుంది. ఇటీవలే గోదారి గట్టుపైనతో జస్ట్ యావరేజ్ ఫలితం అందుకున్న సుమంత్ ప్రభాస్ కు ఈ సక్సెస్ చాలా కీలకం. మేం ఫేమస్ తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకోవడంతో బలమైన హిట్ కొట్టాల్సిన ఒత్తిడి తన మీద ఉంది. మార్కెట్ బలపడాలంటే సూపర్ హిట్లు పడాలి. అంతకు మించి ఆర్టిస్టుగా గుర్తింపు రావాలంటే వైవిధ్యమైన కథలను ఎంచుకోవాలి.

రోమాంచకంకు వాసుకి వైభవ్ సంగీతం సమకూరుస్తుండగా సాంకేతికంగా మంచి క్వాలిటీతో తెరకెక్కుతోందని ఇన్ సైడ్ టాక్. ఇలాంటి టైటిల్ తోనే గతంలో వచ్చిన మలయాళం మూవీకి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా ఫ్రెష్ సబ్జెక్టని చెబుతున్నారు. సంగీతానికి చాలా ప్రాధాన్యం ఉండబోతున్న ఈ లవ్ ఎంటర్ టైనర్ త్వరలోనే విడుదల కానుంది. రిలీజ్ డేట్ ప్రకటించలేదు కానీ సెప్టెంబర్ ప్రాంతంలో ఉండొచ్చని సమాచారం.