రేవంత్, కేటీఆర్ ఒక్కటయ్యారు

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ… సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటూ సాగుతున్న వైనం తెలిసిందే. వారిద్దరి మధ్య గట్ల పంచాయతీలు ఏమీ లేకున్నా…రాజకీయంగా వారు ప్రత్యర్థులుగా సాగుతున్నారు. అంతేకాకుండా కేటీఆర్ అధికారంలో ఉండగా.. రేవంత్ విపక్షంలో ఉన్నారు. ఇప్పుడు రేవంత్ అధికార పక్షంగా మారిపోగా… కేటీఆర్ విపక్షంలోకి మారిపోయారు. వెరసి ఇద్దరి మధ్య నిత్యం మాటల యుద్ధం ఓ రేంజిలో సాగుతోంది. అలాంటి ఈ ఇద్దరూ ఇప్పుడు కలిసిపోయారనే చెప్పారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ఇప్పుడు వీరిద్దరిని ఒక్కతాటిపైకి తీసుకువచ్చింది.

జనాభా ప్రాతిపదికగా మాత్రమే జరిగే డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందన్న భావన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనిపై అందరికంటే ముందుగా తమిళనాడు అదికార పార్టీ డీఎంకే గళం విప్పింది. జనాభా ప్రాతిపదికగా జరిగే డీలిమిషేషన్ తో పెరిగే సీట్లన్నీ ఉత్తరాదిలోనే పెరుగుతాయని… దక్షిణాదిలో నామమాత్రంగా సీట్లు పెరగడమో… లేదంటే అసలే సీట్లు పెరగకపోవడమో… లేదంటే ఉన్న సీట్ల సంఖ్య కూడా తగ్గిపోవడమో జరుగుతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై దేశవ్యాప్తంగా ఓ చర్చ అయితే జరిగేలా చేసిన డీఎంకే ఈ నెల 22న చెన్నైలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలతో అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

చెన్నై వేదికగా జరగనున్న ఈసమావేశానికి రావాలంటూ ఇప్పటికే తెలంగాణలోని అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ లకు డీఎంకే ఆహ్వానాలు అందాయి. ఈ ఆహ్వానాలు అందుకున్న రేవంత్, కేటీఆర్ లు ఈ సమావేశాన్ని స్వాగతించారు. అంతేకాకుండా ఈ సమావేశానికి హాజరవుతామంటూ కూడా వారిద్దరూ ప్రకటించారు. వాస్తవానికి డీఎంకేతో కాంగ్రెస్ ఎప్పటి నుంచో పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే.

ఇక దక్షిణాదికి అనాది నుంచి అన్యాయం జరుగుతోందన్న భావనతో ఉన్న బీఆర్ఎస్ ఈ సమావేశానికి హాజరు కావాలని తీర్మానించడం పెద్దగా ఆశ్చర్యమేమీ లేదు. అయితే బద్ధ శత్రువుల మాదిరిగా కొట్టాడుకుంటున్న రేవంత్, కేటీఆర్ లు ఇద్దరూ ఈ సమావేశాన్ని స్వాగతించడం, సమావేశానికి హాజరవుతామని ప్రకటించడం విశేషం. మరి ఈ సమావేశానికి ఈ రెండు పార్టీల తరఫున వీరిద్దరే హాజరు అవుతారా? లేదంటే… పార్టీల తరఫున వేరే వారిని పంపుతారా? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.