తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉదయం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు అధికార, విపక్షాల సభ్యులంతా దాదాపుగా హాజరయ్యారు. చాలా కాలంగా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) బుధవారం నాటి సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ తీరును చూసిన వెంటనే… మొన్నామధ్య ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహార సరళి ఠక్కున గుర్తుకు వచ్చింది. ఆ వెంటనే కేసీఆర్, జగన్ కు ఎంత తేడా ఉందో చూశారా? అన్న మాటలు కూడా వినిపించాయి.
పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీ ముఖమే చూడని జగన్… తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా సభ గడప తొక్కనీయకుండా కఠిన ఆదేశాలు జారీ చేశారు. అయితే నిర్దేశిత రోజుల పాటు సభకు రాకపోతే… అనర్హత వేటు తప్పదన్న అధికార కూటమి నేతల మాటలతో మొన్నటి బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సభకు వచ్చిన జగన్.. గవర్నర్ ప్రసంగం పూర్తి కాకుండానే సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. సభకు వచ్చి అటెండెన్స్ బుక్ లో సంతకం చేసి… తద్వారా సస్పెన్షన్ వేటును తప్పించుకునేందుకే అసెంబ్లీకి వచ్చినట్లుగా జగన్ తన వైఖరితోనే చెప్పేసినట్టైంది. ఆపై సభకు వచ్చేది లేదని.. ఇందుకు కారణం తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడమేనని కూడా జగన్ ప్రకటించారు.
తాజాగా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా కేసీఆర్ హుందాగా సభకు వచ్చారు. మంగళవారమే బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ కు వచ్చిన ఆయన బీఆర్ఎస్ఎల్పీ భేటీని కూడా ఆయన నిర్వహించారు. ఇక బుధవారం ఉదయం నిర్దేశిత సమయానికే ఆయన అసెంబ్లీకి చేరుకుని… బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మరోమారు తన పార్టీ సభ్యులతో భేటీ అయ్యారు. ఆ తర్వాత తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కేసీఆర్ సభకు వెళ్లారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్టుదేవ్ శర్మ ప్రసంగిస్తున్నంత సేపు కేసీఆర్ ఆ ప్రసంగాన్ని విన్నారు. కొన్ని కీలక అంశాలను గవర్నర్ ప్రస్తావిస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు నినాదాలతో నిరసన వ్యక్తం చేసినా… గవర్నర్ ప్రసంగాన్ని కేసీఆర్ సహా బీఆర్ఎస్ సభ్యులంతా సాంతం విన్నారు. ఆ తర్వాత సభ వాయిదా పడగా… కేసీఆర్ ఇతర సభ్యులతో కలిసి సభ నుంచి వెళ్లిపోయారు. వెరసి అనుభవశీలిగా కేసీఆర్ వ్యవహరిస్తే… జగన్ మాత్రం దుందుడుకు తత్వంతో వ్యవహరించారన్న మాటలు వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates