పలు కేసులలో విచారణ ఎదుర్కొంటున్న రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ మధ్యంతర బెయిల్ పై బయటకు వెళ్లిన వైనంపై తీవ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఫేక్ మెడికల్ సర్టిఫికెట్లతో బోరుగడ్డ బెయిల్ పొందారని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆయనకు ఇచ్చిన బెయిల్ గడువు ముగియడం, ఆ తర్వాత కోర్టు మరోసారి మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో రాజమండ్రి జైలుకు వచ్చి ఈ రోజు ఉదయం బోరుగడ్డ లొంగిపోయారు. అయితే, ఆ వెంటనే బోరుగడ్డకు గుంటూరు పోలీసులు షాకిచ్చారు.
పాస్టర్‌ను బెదిరించిన కేసులో పీటీ వారెంట్‌పై అనిల్‌ను పట్టాభిపురం పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. ఈ రోజు ఉదయం గుంటూరు పోలీసులు రాజమండ్రి జైలుకు వెళ్లారు. గుంటూరు కోర్టులో బోరుగడ్డను పోలీసులు హాజరుపర్చనున్నారు. అంతకుముందు, బోరుగడ్డ అనిల్‌కు ఏపీ హైకోర్టు డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది. తన తల్లి అనారోగ్యం కారణంగా చెన్నైలో ఉన్నానని బోరుగడ్డ చెప్పడంతో…వెంటనే ఫ్లైట్‌లో రాజమండ్రి వచ్చి సెంట్రల్ జైల్లో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.
మరోసారి మధ్యంతర బెయిల్ పొడిగించేది లేదని తేల్చి చెప్పింది. రాజమండ్రి జైలులో లొంగిపోకుండా మధ్యంతర బెయిల్ పొడిగించాలంటూ హైకోర్టులో బోరుగడ్డ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో, కోర్టు పైవిధంగా స్పందించింది. ఏది ఏమైనా..మధ్యంతర బెయిల్ పై మరిన్ని రోజులు బయట ఉండాలన్న బోరుగడ్డ కథ అడ్డం తిరిగింది.