ఏపీలోని ఉత్తరాంధ్ర అడవులు.. ప్రత్యేకించి విశాఖ మన్యం అడవులు అరకులో సాగు అవుతున్న కాఫీకి ఎక్కడ లేని ప్రాధాన్యం ఉంది. రుచిలో ప్రపంచంలోనే అత్యుత్తమ వెరైటీగా నిలిచిన అరకు కాఫీకి ఇప్పటిదాకా పెద్దగా గుర్తింపే దక్కలేదు. అయితే ఇప్పుడు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రత్యేక శ్రద్ధ కారణంగా అరకు కాఫీ ఖండాంతరాలు దాటిపోతోంది. తాజాగా దేశంలోని అత్యున్నత చట్ట సభ పార్లమెంటులో అరకు కాఫీ కేఫ్ ఏర్పాటు కానుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పార్లమెంటు సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులకు అక్కడ అరకు కాఫీ ఘుమఘుమలు అలరించనున్నాయి. ఈ మేరకు పార్లమెంటులో అరకు కాఫీ కేఫ్ ఏర్పాటుకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు.
ఏపీని పాలించిన ఆయా ప్రభుత్వాలు వ్యవహరించిన తీరుతో అసలు అరకు కాపీ ఒకటి ఉందన్న విషయం ఇప్పటిదాకా బయటి ప్రపంచానికి తెలియనే లేదు. అయితే 2014లో తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోగా… ఏపీకి మరోమారు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తన సతీమణి నారా భువనేశ్వరి సలహాతో అరకు కాఫీ ప్రమోషన్ కు నడుం బిగించారు. ఇందుకోసం ఓ ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకున్న చంద్రబాబు… ఎక్కడికి వెళ్లినా…అరకు కాఫీ పొడితో కూడిన గిఫ్ట్ ప్యాకెట్లు పట్టుకుని మరీ ఫ్లైట్ ఎక్కుతున్నారు. రాష్ట్రం బయట తాను కలిసే ప్రముఖులకు వాటిని ఇవ్వడంతో పాటుగా రాష్ట్రానికి వస్తున్న ప్రముఖులకు కూడా వాటిని అందిస్తూ అరకు కాఫీని అన్ని ప్రాంతాల వారూ రుచి చూసేలా చేస్తున్నారు.
ఇటీవలే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుల కోసం దావోస్ వెళ్లిన చంద్రబాబు బృందం అక్కడికి కూడా అరకు కాఫీని వెంటబెట్టుకుని వెళ్లింది. అక్కడ అరకు కాఫీతో కూడిన ఓ కెటిల్ ను పెట్టి… ఏపీ పెవిలియన్ పరిసరాలను అరకు కాఫీ ఘుమఘుమలతో అదిరిపోయేలా చేసింది. తాజాగా పార్లమెంటులో అరకు కాఫీ కేఫ్ ఏర్పాటుతో మరింత మందికి అరకు కాఫీ పరిచయం కానుంది. పార్లమెంటు సభ్యులతో పాటుగా ఆయా రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, ఆయా పార్టీల కీలక నేతలు, ఆయా రాష్ట్రాలకు చెందిన మీడియా ప్రతినిధులు నిత్యం పార్లమెంటుకు వస్తూనే ఉంటారు కదా. వారిని మన అరకు కాఫీ ఆకట్టుకోవడం ఖాయమే. త్వరలోనే అరకు ఘుమఘుమలు దేశవ్యాప్తంగా విస్తరించడం కూడా ఖాయమేనని చెప్పక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates