తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికల పోలింగ్ ఈ నెల 20న జరగనుంది. అయితే.. ఈ ఎన్నికలు ఏపీలో మాదిరిగా ఏకగ్రీవం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మొత్తం ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఏకంగా 11 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. వీటిలో కాంగ్రెస్+సీపీఐ నుంచి నలుగురు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఒక్కరు ఉండగా.. మిగిలిన వారు ఇండిపెండెంట్లుగా రంగంలోకి దిగారు. దీంతో ఈ ఎన్నికల్లో ఓటు ఎటు పడుతుందన్నది ఆసక్తిగా మారింది.
మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ తరఫున బరిలో నిలిచిన దాసోజు శ్రవణ్ విజయంపై నీలినీడలు కమ్ముకున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి.. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు.. ప్రస్తుతం న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నారు. వారిని అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో వీరంతా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో ఈ అసమ్మతి ఎమ్మెల్యేల ఓటు బీఆర్ఎస్‌కు పడే అవకాశం తక్కువనే ఉంది.
మరోవైపు.. వీరి ఓట్లను సొంతం చేసుకునేందుకు ఇండిపెండెంట్లుగా రంగంలొకి దిగిన వారు ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు ఉన్న పరిచయాలను వాడుకుంటున్నారు. కానీ, కాంగ్రెస్‌పై మక్కువతో వారు ఆ పార్టీకే ఓటు వేసే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు జంపింగుల ఓట్లు ఎడు పడతాయన్న చర్చ సాగుతోం ది. ఏదేమైనా.. ఏపీలో అయినట్టుగా ఏకగ్రీవం కాకపోగా.. మరింత ఉత్కంఠ పోరు అయితే.. కొనసాగనుంది.
కేసీఆర్ ఏరికోరి ఎంచుకున్న దాసోజుకు మెజారిటీ ఓట్లు పడతాయా? లేదా ? అన్న చర్చ కూడా జోరుగానే సాగుతోంది. అయితే.. నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం వరకు సమయం ఉండడంతో ఆ లోగా కొందరు తప్పుకొంటారని భావిస్తున్నారు. ఒకవేళ తప్పుకోకపోతే మాత్రం ఎమ్మెల్యే కోటా ఎన్నికలు ఈ సారి హాట్ హాట్‌గానే సాగనున్నాయి.