ఏపీ అప్పులు వేరు.. అమ‌రావ‌తి అప్పులు వేరు: వైసీపీకి షాకిచ్చిన కేంద్రం

ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీకి కేంద్రం భారీ షాకిచ్చింది. రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి ప్ర‌పంచ బ్యాంకు స‌హా ఆసియా అభివృద్ది బ్యాంకు ఇస్తున్న రుణాల‌ను ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వ అప్పుల్లో భాగం చేయాల‌ని కోరుతూ.. వైసీపీ ఎంపి చేసిన విజ్ఞ‌ప్తిని కేంద్రం తిర‌స్క‌రించింది. అంతేకాదు.. అస‌లు అమ‌రావ‌తి అప్పులు వేరు.. రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న అప్పులు వేరుగా చూస్తున్న‌ట్టు తెలిపింది. రాజ‌ధాని కోసం చేస్తున్న అప్పులను సాధార‌ణ రాష్ట్ర అప్పుల జాబితాలో చేర్చే ప‌రిస్థితి లేద‌ని తేల్చి చెప్పింది. దీనిపై కేంద్రానికి ఒక నిర్దిష్ట‌మైన అభిప్రాయం ఉంద‌ని పేర్కొంది.

ఏం జ‌రిగింది?

ఏపీ రాజ‌ధాని నిర్మాణానికి కేంద్ర ప్ర‌భుత్వం.. ప్ర‌పంచ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్లు, ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి విడ‌త‌ల వారీగా రూ.15 వేల కోట్ల చొప్పున రుణాలు ఇప్పిస్తోంది. దీనికి తోడు కేంద్రం కూడా ఇప్ప‌టికి రూ.2500 కోట్ల‌ను మంజూ రు చేసింది. దీనిపై తాజాగా పార్ల‌మెంటు స‌మావేశాల సంద‌ర్భంగా వైసీపీ ఎంపీ.. మాట్లాడుతూ.. అమ‌రావ‌తికి కోసం చేస్తున్న అప్పుల‌ను రాష్ట్ర అప్పుల జాబితాలో చేర్చుతున్నారా? అలా అయితే.. మొత్తం అప్పు ఎంత‌? అని ప్ర‌శ్నించారు. దీనికి కేంద్ర ఆర్థిక శాఖ స‌హాయ మంత్రి పంక‌జ్ చౌధ‌రి స‌మాధానం ఇచ్చారు. అమ‌రావ‌తి అనేది నిర్దిష్ట ప్రాజెక్టు అని.. దీనికి ప్ర‌పంచ స్థాయి సంస్థ‌లు అప్పులు ఇస్తున్నాయ‌ని తెలిపారు.

ఈ అప్పులను రాష్ట్ర స‌ర్కారు అప్పుల జాబితాలో చేర్చ‌డం లేద‌ని చెప్పారు. అంతేకాదు.. విదేశీ సంస్థ‌ల నుంచి తీసుకునే రుణాలు..రాష్ట్ర అప్పుల జాబితాలోకి రాబోవ‌ని తెలిపారు. కేవ‌లం ఆర్బీఐ లేదా దేశీయ బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలు మాత్ర‌మే రాష్ట్ర అప్పుల జాబితాలో చేరుతాయ‌ని వివ‌రించారు. ఇక‌, ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచి ప్ర‌పంచ బ్యాంకు, ఫిబ్ర‌వ‌రి 10 నుంచి ఆసియా అభివృద్ది బ్యాంకు ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి అప్పులు ఇచ్చేందుకు రెడీ అయ్యాయ‌ని తెలిపారు. అయితే.. దీనికి సంబంధించిన సొమ్ములు ఇంకా విడుద‌ల కాలేద‌ని చెప్పారు. అమ‌రావ‌తి మొత్తం వ్య‌యంలో 10 శాతం లేదా 1500 కోట్ల రూపాయ‌ల‌ను ప్ర‌త్యేక గ్రాంటుగా త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్న‌ట్టు మంత్రి వివ‌రించారు.