రాజకీయ అధినేతల మాటలు ఒకలా.. చేతలు మరోలా ఉండటం సహజం. మాట్లాడే సిద్ధాంతాలు.. విలువల్ని చేతల్లో చేసి చూపిస్తారనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎక్కడో దగ్గర రాజీ అన్నది కనిపిస్తూ ఉంటుంది. పార్టీ నేతలు చేసే రచ్చలను చూసిచూడనట్లుగా వ్యవహరిస్తుంటారు. వేటు వేసే విషయంలో చూసిచూడనట్లుగా వ్యవహరిస్తారు. గొడవ ముదిరి.. విమర్శలు వెల్లువెత్తినా ఆరోపణలు వచ్చిన నేత విషయంలో చర్యలు తీసుకోకుండా ఉండటం తెలిసిందే. ఇందుకు ఆ పార్టీ.. ఈ రాజకీయ పార్టీ అన్న తేడా కనిపించదు. కానీ.. జనసేనాని పవన్ కల్యాణ్ మాత్రం అలాంటి తీరుకు భిన్నమన్న విషయాన్ని అందరికి మరోసారి తెలిసేలా చేశాడు.
పార్టీ సిద్దాంతాలకు భిన్నంగా వ్యవహరించే కీలక నేత చేసిన తప్పును ఉపేక్షించలేదు సరి కదా.. చర్యలు కూడా స్పీడ్ గా చేసేశారు. అది కూడా వేటు వేయటం కాదు.. ముందు క్షమాపణలు చెప్పించి మరీ వేటు వేయించిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ఉదంతాన్ని చూసిన తర్వాత.. గీత దాటిన నేతల విషయంలో తానెంత కరకుగా ఉంటానన్న విషయాన్ని పవన్ చేతలతో చెప్పేశారు. అసలేం జరిగిందన్నది చూస్తే..
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు వరుపుల తమ్మయ్యబాబు. తాజాగా ఒక ఉదంతంలో అతగాడు చేసిన హడావుడి.. రచ్చ అందరిని షాక్ కు గురి చేసింది. జనసేన అధినేత తీరుకు భిన్నంగా వ్యవహరిస్తూ.. ఆసుపత్రిలో రచ్చ చేయటమే కాదు.. మహిళా వైద్యురాలి విషయంలో పరుషంగా వ్యవహరించిన వైనం వివాదాస్పదంగా మారింది. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడి వద్ద నేషనల్ హైవే మీద శనివారం రాత్రి ఒక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో తమ్మయ్యబాబు సొంతూరు లింగంపర్తికి చెందిన ఇద్దరు గాయపడ్డారు. వారిని ప్రత్తిపాడు సీహెచ్ సీకి తరలించారు. ఆ టైంలో నైట్ డ్యూటీ వైద్యురాలిగా శ్వేత విధుల్ని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి వైద్యం చేస్తున్న డాక్టర్ శ్వేతకు ఒక చోటా నేత ఫోన్ చేతికి ఇచ్చి.. తమ్మయ్యబాబుతో మాట్లాడాలని చెప్పారు. ఆమె చేసిన తప్పు.. ఆయనెవరో తనకు తెలీదని.. వైద్యం చేస్తున్నట్లుగా చెప్పేసి ఫోన్ ఇచ్చేశారు. దీంతో తమ్మయ్యబాబు ఈగో దారుణంగా దెబ్బ తింది.
నేనెవరో తెలీదంటావా? అంటూ కాసేపటికే ఆసుపత్రికి వచ్చిన ఆయన రచ్చ చేయటం షురూ చేశాడు. నేను ఎవరో తెలీదా? స్పందించరా? ఒళ్లు దగ్గర పెట్టుకొని పని చేయండి. ప్రజల సొమ్ము తీసుకొని జాబ్ లు చేస్తున్నారంటూ.. ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అతడి రచ్చను ఫోన్ లో షూట్ చేస్తున్న సిబ్బంది నుంచి ఫోన్ లాక్కొని మరీ అందులోని వీడియో తొలగించారు. దాదాపు గంట పాటు ఆసుపత్రిలో రచ్చ చేవారు.
అయితే.. ఈ వ్యవహారంలో సీహెచ్ సీకి సూపరింటెండెంట్ గా వ్యవహరిస్తున్న సౌమ్య వైద్యురాలు శ్వేతకు అండగా నిలవటమే కాదు.. మహిళా దినోత్సవం వేళ వైద్యురాల్ని అవమానించిన వైనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వైద్య సేవల్లో చురుగ్గా పాల్గొనలేదు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వైద్యురాలిని రిపోర్టు కోరారు. ఈ ఘటన డిప్యూటీ సీఎం కం జనసేనాని పవన్ వరకు వెళ్లింది. దీనిపై చట్టప్రకారం ముందుకు వెళ్లాలన్న సూచన చేశారు. ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామిని పార్టీ అధినాయకత్వం ఆదేశించింది.
అనంతరం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సినిమాలో మాదిరి.. తమ్మయ్యబాబును వెంట పెట్టుకొని వచ్చిన తుమ్మల ప్రత్తిపాడు సీహెచ్ సీకి వచ్చారు . డీసీహెచ్ ఎస్ స్వప్నకు.. సూపరింటెండెంట్ సౌమ్యకు.. డాక్టర్ శ్వేతకు.. ఆమె తల్లి.. ఇతర వైద్యుల సమక్షంలో తమ్మయ్యబాబు చేత క్షమాపణలు చెప్పించారు. ఆ తర్వాత ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా పార్టీ ప్రకటన విడుదల చేసింది. అన్యాయం మీద పోరాటం చేస్తానని చెప్పే జనసేనాని.. తమ పార్టీ నియోకవర్గం ఇంఛార్జి విషయంలోనూ తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరించటం.. చేసిన తప్పుకు చెంపలేసుకొని మరీ సారీ చెప్పించి.. పార్టీ నుంచి బయటకు పంపిన వైనం చూసినప్పుడు పవన్ కల్యాణ్ రూటు సపరేటు అని మాత్రం చెప్పక తప్పదు.