కేసీఆర్‌కు మ‌రో ఉచ్చు.. సుప్రీంలో నాగం పిటిష‌న్‌

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మ‌రో ఉచ్చు చిక్కుకునేలా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఆయ‌న ప‌లు ప్రాజెక్టులకు సంబంధించిన అవినీతి ఆరోప‌ణ‌ల కేసుల్లో చిక్కుకున్నారు. వీటిపై విచార‌ణ సాగుతోంది. తాజాగా పాల‌మూరు-రంగారెడ్డి ఎత్తి పోత‌ల ప‌థ‌కానికి సంబంధించిన మాజీ మంత్రి నాగం జ‌నార్ద‌న్‌రెడ్డి సుప్రీంకోర్టులో కేసు వేశారు. హైకోర్టులో ఈ వివాదంపై దాఖ‌లు చేసిన కేసుల‌ను కొట్టి వేయడాన్ని స‌వాలు చేయ‌డంతోపాటు ఈ ప్రాజెక్టును చేప‌ట్టిన బీహెచ్ ఈఎల్ దాఖ‌లు చేసిన అఫిడ‌విట్‌ను బేస్ చేసుకుని నాగం న్యాయ పోరాటానికి దిగారు.

బీఆర్ ఎస్ హ‌యాంలో ప‌లు సాగునీటి ప్రాజెక్టుల‌ను చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. వీటిలో పాల‌మూరు-రంగారెడ్డి కూడా కీల‌క‌. పాల‌మూరు ప్ర‌జ‌ల‌కు సాగు, తాగు నీటి అవ‌స‌రాల‌ను తీర్చేందుకు సంకల్పించిన ఈ ప్రాజెక్టులో అవినీతి ఆరోప‌ణ‌లు రాజుకున్నాయి. ప‌నులు చేప‌ట్టిన త‌మ‌కు బిల్లులు ఇవ్వ‌డం లేద‌ని సంస్థ బీహెచ్ ఈఎల్ కూడా.. కోర్టులో అఫిడ‌విట్ వేసింది. దీనిపై గ‌తంలో విచార‌ణ చేసిన హైకోర్టు.. రాజ‌కీయ కార‌ణాల‌తోనే వీటిని వేసిన‌ట్టుగా భావించి కొట్టివేసింది.

ఈ క్ర‌మంలో నాగం జోక్యం చేసుకుని తాజాగా సుప్రీంకోర్టులో కేసు వేశారు. శుక్ర‌వారం వీటిని విచారించిన సుప్రీంకోర్టు.. ఇరు ప‌క్షాల వాద‌న‌ల‌ను న‌మోదు చేసింది. అక్ర‌మాలు జ‌రిగాయ‌న్న‌దివాస్త‌వ‌మ‌ని, దీనికి బీహెచ్ ఈఎల్ స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ ప్ర‌బ‌ల సాక్ష్య‌మ‌ని.. నాగం త‌ర‌ఫున న్యాయ‌వాది ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టుకు విన్న‌వించారు. అయితే.. ఈ కేసుల‌ను హైకోర్టు కొట్టి వేసింద‌ని మ‌రో న్యాయ‌వాది ముకుల్ రోహ‌త్గీ చెప్పారు. అయితే.. కేసులో పూర్వాప‌రాలు బ‌లంగా ఉన్నాయ‌ని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

ఈ సంద‌ర్భంగా నాగం దాఖ‌లు చేసిన రిజాయిండ‌ర్ స‌హా.. అన్ని పిటిష‌న్ల‌ను విచార‌ణ‌కు తీసుకుంటున్న ట్టు కోర్టు స్ప‌ష్టం చేసింది. అక్ర‌మాలు జ‌రిగాయ‌ని బ‌లంగా ఆధారాలు క‌నిపిస్తున్నందున త‌క్ష‌ణ‌మే వీటిపై ఉన్న‌త స్థాయి విచార‌ణ‌కు ఆదేశించాల‌న్న నాగం అభ్య‌ర్థ‌న‌పై మాత్రం ఇప్ప‌టికిప్పుడు స్పందించ‌లే మ‌ని విచార‌ణ కొంత మేర‌కు ముందుకు సాగిన త‌ర్వాత‌.. నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తామ‌ని తేల్చి చెప్పింది. దీంతో మున్ముందు కేసీఆర్ చుట్టూ పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కేసు కూడా చిక్కుకునే అవ‌కాశం ఉంద‌ని న్యాయ వాద వ‌ర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.