పోసానికి బెయిల్‌.. కానీ, జైలు త‌ప్ప‌లేదుగా!

వైసీపీ మాజీ నాయ‌కుడు, మాట‌ల ర‌చ‌యిత, న‌టుడు పోసాని కృష్ణ ముర‌ళికి క‌డ‌ప జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సోష‌ల్ మీడియా లో అనుచిత వ్యాఖ్య‌లు, రెచ్చ‌గొట్టేలా చేసిన ప్ర‌సంగాల‌పై అందిన ఫిర్యాదు మేర‌కు.. అన్న‌మ‌య్య‌ జిల్లాలోని రాయ‌చోటి నియోజ‌క‌వ‌ర్గం ఓబుల‌వారి ప‌ల్లె పోలీసులు.. కొన్ని రోజుల కిందట పోసానిని హైద‌రాబాద్‌లో అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న‌ను క‌డ‌పకు త‌ర‌లించి.. జైలులో రిమాండ్ ఖైదీగా ఉంచారు.

అనంత‌రం.. త‌మ జిల్లాలోనూ పోసానిపై ఫిర్యాదులు ఉన్నాయ‌ని పేర్కొంటూ.. ప‌ల్నాడు, క‌ర్నూలు జిల్లాల పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకుని.. రిట్ పిటిష‌న్ వేసి.. విచార‌ణ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. అయితే.. త‌న‌పై కేసులు కొట్టివేయాల‌ని కోరుతూ.. పోసాని హైకోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై అనేక మార్లు విచార‌ణ జ‌రిపిన కోర్టు.. తాజాగా శుక్ర‌వారం పోసానిపై కేసులు కొట్టివేసేందుకు నిరాక‌రించింది. ఇది భారీ ఎదురు దెబ్బ‌కాగా.. ఇదేస‌మ‌యంలో క‌డ‌ప కోర్టు పోసానికి బెయిల్ ఇచ్చింది.

అయితే.. ఈ బెయిల్ కేవ‌లం.. ఓబుల‌వారిప‌ల్లెలో న‌మోదైన కేసుకు సంబంధించి మాత్ర‌మే వ‌ర్తిస్తుంద‌ని.. కోర్టు స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. పోలీసులు పోసానిని త‌మ‌కు అప్ప‌గించాలంటూ దాఖ‌లు చేసిన క‌స్ట‌డీ పిటిష‌న్‌ను కూడా కోర్టు తోసిపుచ్చింది. ఇప్ప‌టికే రెండు రోజుల పాటు కస్ట‌డీకి ఇచ్చామ‌ని.. పేర్కొన్న న్యాయ‌స్థానం తాజాగా దాఖ‌లు చేసిన క‌స్ట‌డీ పిటిష‌న్‌ను కొట్టి వేసింది. దీంతో ఈ కేసులో పోసానికి ఊర‌ట ల‌భించింది.

కానీ, క‌ర్నూలు జిల్లా ఆదోని, ప‌ల్నాడు జిల్లా న‌ర‌స‌రావుపేట పోలీసులు న‌మోదు చేసిన కేసులు మాత్రం విచార‌ణ‌లో ఉన్నాయి. ఈ కేసుల్లోనూ పోసానికి 14 రోజుల రిమాండ్ ప‌డింది. దీంతో ఆయ‌న‌కు క‌డ‌ప కోర్టు బెయిల్ మంజూరు చేసినా.. ఈ కేసుల్లో ఆయ‌న జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. కాగా.. సోషల్ మీడియాలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌, నారా చంద్ర‌బాబు స‌హా వారి కుటుంబ స‌భ్యుల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశార‌ని పేర్కొంటూ.. పోసాని రాష్ట్ర వ్యాప్తంగా 14 కేసులు న‌మోదైన విష‌యం తెలిసిందే.