ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే జారీ అయిపోయింది. త్వరలోనే నామినేషన్లకు గడువు కూడా ముగియనుంది. వైసీపీని వీడిన జంగా కృష్ఱమూర్తితో పాటుగా టీడీపీకి చెందిన యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, బీటీ నాయుడు, దువ్వారపు రామారావుల పదవీ కాలం ఈ నెల 29తో ముగియనుంది. వీరి స్థానాలను భర్తీ చేసేందుకే ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో విపక్షం వైసీపీకి కేవలం 11 మంది సభ్యులున్న నేపథ్యంలో ఆ పార్టీ పోటీ చేసే అవకాశమే లేదు. ఫలితంగా మొత్తం 5 స్థానాలు కూడా అధికార కూటమి ఖాతాలోనే పడనున్నాయి.
ఈ 5 సీట్లలో ఓ సీటును కూటమిలోని జనసేనకు కేటాయించగా… ఆ స్థానం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు కొణిదెల నాగేంద్ర బాబు పోటీ చేయనున్నారు. ఈ మేరకు బుధవారమే పవన్ కల్యాణ్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించేశారు. మరి మిగిలిన 4 సీట్లలో ఎవరిని పోటీకి దింపనున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అధికార కూటమిలో జనసేనతో పాటుగా టీడీపీ, బీజేపీలు ఉన్నాయి. ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా 135 సీట్లతో టీడీపీ బలీయంగా ఉంది. ఇక ఇటీవల వైసీపీ ఎంపీల రాజీనామాలతో అందిన 3 రాజ్యసభ సీట్లలో ఓ సీటును బీజేపీకి ఇచ్చిన టీడీపీ… తాను రెండు సీట్లను తీసుకుంది. ఈ లెక్కన ఇప్పుడు అందివచ్చిన 5 ఎమ్మెల్సీ స్థానాల్లో ఓ స్థానాన్ని జనసేనకు ఇచ్చిన టీడీపీ… మిగిలిన 4 సీట్లలో తన పార్టీ అభ్యర్థులనే బరిలోకి దింపాలని యోచిస్తోంది.
రాజకీయాలకు వీడ్కోలు పలికిన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటును తనకు ఇస్తే… ఎమ్మెల్సీ సీట్లలో తనకేమీ వాటా అక్కర్లేదని ఇప్పటికే బీజేపీ చెప్పినట్టుగా సమాచారం. ఈ లెక్కన మొత్తం 4 సీట్లలోనూ టీడీపీ తన అభ్యర్థులనే బరిలోకి దింపుతున్నట్లు సమాచారం. అయితే ఈ 4 సీట్ల కోసం టీడీపీలోనూ భారీ ఎత్తున పోటీ నెలకొంది.
ఈ 4 సీట్లలో ఓ సీటును ఎస్సీలకు, రెండు సీట్లను బీసీలకు ఇచ్చి… మిగిలిన ఒక సీటును వేరే వర్గాలకు కేటాయించాలని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు భావిస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు శుక్రవారం అమరావతి చేరుకున్నాక.. దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటారని సమాచారం. శుక్రవారం తుది జాబితా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అప్పటిదాకా ఈ సస్పెన్స్ కొనసాగక తప్పదన్న వాదన వినిపిస్తోంది.
చంద్రబాబు అంచనా ప్రకారం ఎస్సీ కోటాలో మాజీ మంత్రి కేఎస్ జవహర్, బీసీ కోటాలో… బీటీ నాయుడు, బుద్ధా వెంకన్నల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. కర్నూలు జిల్లాకు చెందిన బీటీ నాయుడు పార్టీ కోసం కష్టపడుతున్న తీరుతో ఆయన సీటును తిరిగి ఆయనకే ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం.
అలాగే… విజయవాడలో పార్టీ తరఫున బలమైన గొంతుకగా ఉన్న బుద్ధా వెంకన్నకు కూడా మరోమారు ఎమ్మెల్సీ ఇవ్వాలని దాదాపుగా నిర్ణయం జరిగిపోయినట్లు తెలుస్తోంది. మిగిలిన సీటును కమ్మ సామాజిక వర్గానికి ఇస్తే… మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అందరికంటే ముందు వరుసలో ఉన్నారు. అలా కాకుండా మైనారిటీలకు ఇస్తే… వైసీపీ వీడి టీడీపీలో చేరి పదవి కోసం చాలా కాలంగా వేచి చూస్తున్న జలీల్ ఖాన్ ఉన్నారు.