నియోజకవర్గాల పునర్విభజన అంశం దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. 2029 సార్వత్రిక ఎన్నికల్లోగా నియోజకవర్గాల పునర్విభజన పూర్తి కానుందని… ఈ పరిణామంతో లోక్ సభ సీట్ల సంఖ్య ఒక్కసారిగా అమాంతంగా పెరిగిపోతుందని… ఇప్పుడున్న ఎంపీ కంటే కూడా దాదాపుగా 200 మంది ఎంపీలు ఎక్కువగా లోక్ సభలో ప్రవేశించనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామంపై దక్షిణాది రాష్ట్రాల్లో చాలా కాలంగా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
జనాభా ఆధారంగా జరిగే డీలిమిటేషన్ తో ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో పెరగనున్న సీట్లు పెరిగితే… దక్షిణాదిలో మాత్రం అరకొర సీట్లు మాత్రమే పెరుగుతాయన్నది ఈ వాదనల సారాంశం. ఇది నిజమేనన్నట్లుగా తమిళనాడులోని దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తున్నాయి. ఈ మేరకు బుధవారం అదికార డీఎంకే నిర్వహించిన అఖిలపక్ష భేటీకి హాజరైన అన్ని పార్టీలు కూడా సీఎం ఎంకే స్టాలిన్ ప్రతిపాదించిన తీర్మానానికి ఓకే చెప్పేశాయి. డీలిమిటేషన్ ను 30 ఏళ్ల తర్వాత చేపట్టాలని ఈ తీర్మానం డిమాండ్ చేసింది.
అయితే దక్షిణాది అంటే తమిళనాడు ఒక్కటే కాదు కదా. తమిళనాడుతో పాటుగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళలు ఉన్నాయి. అంతోఇంతో ఒరిస్సా కూడా దక్షిణాది రాష్ట్రాల బాటలోనే సాగుతుంది. ఇలాంటి నేపథ్యంలో డీలిమిటేషన్ పై తమిళనాడులో ఇంత పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం అవుతుంటే… మిగిలిన రాష్ట్రాల్లో అటు అధికార పార్టీల నుంచే కాకుండా ఇటు విపక్ష పార్టీల నుంచి కూడా కనీసం స్పందన లేదు.
ఏపీలో కేంద్రంలో అధికారంలో ఉన్న కూటమి సర్కారే అధికారంలో ఉంది. ఈ కారణంగా ఏపీని పక్కనపెడితే… తెలంగాణ, కర్ణాటకల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఈ రెండు రాష్ట్రాలు గళం విప్పుతాయని తమిళనాడు పార్టీలు భావించాయి. అయితే ఈ రాష్ట్రాల నుంచి ఇప్పటిదాకా అసలు సింగిల్ ప్రకటన కూడా విడుదల కాలేదు. అంతేకాకుండా డీలిమిటేషన్ తో తమకు నష్టమే లేదన్నట్లుగా ఈ రెండు రాష్ట్రాల్లోని పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ఇక కేరళ విషయానికి వస్తే… అక్కడి పార్టీలు దేని మీద ఎప్పుడు స్పందిస్తాయో కూడా తెలియని పరిస్థితి. వెరసి… డీలిమిటేషన్ పై గళం విప్పే విషయంలో తంబీలు ఒంటరిగానే పోరు సాగించక తప్పదా? అన్న దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి.
ఇదే సమయంలో డీలిమిటేషన్ పై టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు బుధవారం ఢిల్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ ను 30 ఏళ్ల పాటు వాయిదా వేయాలనడం సరి కాదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి 25 ఏళ్లకు ఓ సారి డీలిమిటేషన్ జరగాల్సి ఉందన్న వాదన సరైనదేనన్న చంద్రబాబు… అప్పుడే అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుందన్నారు.
అలాంటి డీలిమిటేషన్ కు సమయం ఆసన్నమైన వేళ… దానిని మరో 30 ఏళ్ల పాటు వాయిదా వేయాలని కోరడం ముమ్మాటికీ తప్పేనని ఆయన తేల్చిపారేశారు. ప్రస్తుతం డీలిమిటేషన్ అత్యవసరమని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అయినా ఉత్తరాది రాష్ట్రాల జనాభా కంటే దక్షిణాది రాష్ట్రాల జనాభా తక్కువగా ఉన్న విషయాన్ని తాను ఎప్పుడో గుర్తించానని… అందుకే జనాభా పెరుగుదల దిశగా తాను ఇప్పటికే చర్యలు ప్రారంభించానని తెలిపారు. అయితే డీలిమిటేషన్ కు సమయం ఆసన్నమైనప్పుడే జనాభా తక్కువగా ఉందంటూ యాగీ చేయడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. వెరసి తమిళనాడు ఆందోళనలకు ఈ దఫా దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్దగా మద్దతు లభించదనే చెప్పాలి.