జగన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన లోకేశ్

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుతో పాటుగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిత్యం విరుచుకుపడుతున్నారు. ఇటీవలి కాలంలో పవన్ ప్రస్తావన పెద్దగా తీసుకురాని జగన్… చంద్రబాబుపై అయితే ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే తీరును ఆయన బుధవారం కూడా కొనసాగించారు. తాజాగా ప్రవేశపెట్టిన ఏపీ వార్షిక బడ్జెట్ పై స్పందించడానికి అంటూ బుధవారం మీడియా ముందుకు వచ్చిన జగన్… ఆ విషయాన్ని అంతగా పట్టించుకోకుండా… చంద్రబాబు, పవన్ లను చులకన చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబుకు ప్రధాన ప్రతిపక్ష హోదాను తానే ఇచ్చానని చెప్పిన జగన్… ప్రభుత్వ పథకాలు టీడీపీ వారికి మాత్రమే ఇవ్వడానికి సర్కారీ నిధులు ఏమైనా చంద్రబాబు అబ్బ సొత్తా అంటూ దూషణలకు దిగారు. ఇక పవన్ పేరు విన్నంతనే ఆయనో కార్పొరేటర్ కు ఎక్కువ… ఎమ్మెల్యేకు తక్కువ అంటూ హేళన చేసేలా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై అటు టీడీపీతో పాటుగా ఇటు జనసేన శ్రేణులు ఆగ్రహం వ్కక్తం చేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా జగన్ వ్యాఖ్యలను ఖండిస్తూ లెక్కలనన్ని పోస్టులు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇదేం పద్దతి అంటూ న్యూట్రల్ జనం కూడా జగన్ తీరును ప్రశ్నిస్తున్నారు.

ఇలాంటి తరుణంలో శాసన మండలి సమావేశాలు వాయిదా పడగానే…టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన జగన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల గురించి మాట్లాడేటప్పుడు జగన్ జాగ్రత్తగా ఉండాలని లోకేశ్ హెచ్చరించారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తానంటే ఇకపై కుదరదని కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందిలే అనే కాలం పోయిందన్నారు. ఇకపై ప్రతి పదాన్ని విశ్లేషిస్తామని… తప్పు జరిగితే… ఎంత చిన్నదైనా, ఎంత పెద్దదైనా కూడా చట్టం తన పని తాను చేసుకుని పోతుందని కూడా లోకేశ్ హెచ్చరించారు.

అయినా చంద్రబాబు వయసు ఎక్కడ?… జగన్ వయసు ఎక్కడ? అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన లోకేశ్… చంద్రబాబు అనుభవమంత వయసున్న జగన్ ఇష్టానుసారం మాట్లాడతానంటే కుదరదని తేల్చి చెప్పారు. తాము నిబంధనలను ఎప్పుడూ తప్పబోమని.. అలాగని నిబంధనలను తప్పి ప్రవర్తించే వారిని మాత్రం వదిలిపెట్టబోమని లోకేశ్ చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో పవన్ కు వచ్చిన మెజారిటీ ఎంత?… జగన్ కు వచ్చిన మెజారిటీ ఎంత? అని కూడా లోకేశ్ ప్రశ్నించారు. తొలిసారి గెలిచినా రికార్డు మెజారిటీతో పవన్ గెలిచిన విషయాన్ని జగన్ గుర్తించాలన్నారు. ఇకపై జగన్ తో పాటు ప్రతి ఒక్కరూ తమ నోటిని అదుపులో పెట్టుకుని తీరాలని లోకేశ్ సూచించారు. లేదంటే అందుకు తగ్గ ఫలితం కూడా అనుభవించక తప్పదని కూడా ఆయన వార్పింగ్ ఇచ్చారు.