తొందరలో జరగబోయే తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికల్లో బీజేపీ తరపున పోటి చేసే అవకాశం ఎవరికి దక్కుతుందో అనే చర్చ జోరందుకుంటోంది. నిజానికి ఇప్పటికైతే బీజేపీలో ఆసక్తి చూపుతున్న గట్టి అభ్యర్ధి ఒకరే ఉన్నారు. కాకపోతే తొందరలోనే పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతున్న నేత కూడా టికెట్ పై కన్నేసినట్లు సమాచారం. దాంతో పోటీ చేయటం కోసమే సదరు నేత తొందరలో కమలం కండువా కప్పుకుంటారని పార్టీలోనే ప్రచారం పెరిగిపోతోంది. కాబట్టి జరుగుతున్న ప్రచారం నిజమే అయితే ఇద్దరిలో టికెట్ ఎవరికి అన్నదె అర్ధం కావటం లేదు.
ఇంతకీ విషయం ఏమిటంటే తిరుపతి వైసిపి ఎంపి బల్లి దుర్గా ప్రసాదరావు ఈమధ్య చనిపోయిన విషయం తెలిసిందే. కాబట్టి ఉపఎన్నికలు జరపక తప్పదు. అందుకనే ఉపఎన్నికల్లో పోటి చేయటానికి పార్టీలు అభ్యర్ధులను రెడీ చేసుకుంటున్నాయి. ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్నామంటూ అందరికన్నా ముందు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించేశారు. నిజానికి ఇక్కడ పోటి చేసే గెలిచేంత సీన్ బీజేపీకి లేదన్న విషయం అందరికీ తెలుసు. అయితే జనసేన నుండి ఈమధ్య బీజేపీలో చేరిన మాజీమంత్రి రావెల కిషోర్ బాబు పోటీ చేసే విషయంలో బాగా ఆసక్తిగా ఉన్నారట.
మరి ఆయన అభ్యర్ధిత్వంపై పార్టీ నేతల ఆలోచనలు ఎలా ఉన్నాయో ఎవరికీ తెలీదు. ఈ నేపధ్యంలోనే కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత పనబాక లక్ష్మి టీడీపీకి రాజీనామా చేసేసి కమలం కండువా కప్పుకోబోతున్నట్లు తెలిసింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరికి పనబాక బాగా క్లోజ్ ఫ్రెండట. దాంతో పనబాక బీజేపీలో చేరి తిరుపతి ఉపఎన్నికల్లో పోటీ చేయటానికి దాదాపు లైన్ క్లియర్ అయిపోయినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.
ఇప్పటికైతే పనబాక టీడీపీలో పెద్దగా యాక్టివ్ గా లేరని మాత్రం చెప్పవచ్చు. మరి బీజేపీలో ఎప్పుడు చేరుతారో స్పష్టంగా తెలీదు. నెల్లూరుకు చెందిన పనబాక ఇప్పటికి నాలుగుసార్లు ఎంపిగా రెండుసార్లు కేంద్రమంత్రిగా పనిచేసిన కారణంగా ఢిల్లీ బీజేపీ నేతలతో మంచి సంబంధాలే ఉన్నాయట. ఎలాగూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా నెల్లూరు వాసే కాబట్టి ఆయన ఆశీస్సులు కూడా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. మరి ఇదే నిజమైతే రావెల, పనబాకల్లో పోటి చేసే అవకాశం ఎవరికి వస్తుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates