ఏపీలోని కూటమి సర్కారు ఇటీవల ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ పై స్పందించిందుకు అంటూ బుధవారం మీడియా ముందుకు వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ తన పాత పాటనే పాడేశారు. బడ్జెట్ పై తన అభిప్రాయాన్ని అలా అలా చెప్పేసిన జగన్… తనకు సభలో ఎందుకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరు? అంటూ కూటమి సర్కారును నిలదీశారు. ఈ సందర్భంగా గతంలో తాను వినిపించిన వాదనలనే జగన్ బుదవారం కూడా మరోమారు వినిపించారు. సభలో ఉన్నవి రెండే రెండు పక్షాలు.. అందులో ఒకటి అధికార పక్షం కాగా… రెండోది విపక్షమని… విపక్షంలో ఉన్నది వైసీపీ ఒక్కటేనని… ఆ ఒక్క విపక్షానికి ప్రదాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని కూడా జగన్ వాదించారు.
ఈ సందర్భంగా ఓ కొత్త అంశాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. గతంలో చంద్రబాబుకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదాను తానే ఇచ్చానని కూడా జగన్ అన్నారు. నాడు టీడీపీకి వచ్చింది 23 ఎమ్మెల్యే సీట్లేనని గుర్తు చేసిన జగన్…వారిలో ఓ ఐదుగురు పక్కకెళ్లి కూర్చుంటామని తనతో చెప్పారన్నారు. ఇక వైసీపీ నేతలైతే… ఓ 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలను లాగేస్తామని చెప్పారన్నారు. అయితే తానే వద్దని వారించానని కూడా జగన్ అన్నారు. ఈ లెక్కన చంద్రబాబుకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదాను తానే ఇచ్చినట్టే కదా అని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ఆ పదవిని ఇచ్చి.. సభలో ఎంతసేపు కావాలంటే అంత సేపు మాట్టాడాలని చంద్రబాబును కోరానన్నారు. కావాలంటే తన ప్రసంగాలు పరిశీలించాలని కూడా జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇక జనసేనా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశం చివరలో పవన్ గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. ఓట్ల శాతంతో కాకుండా సీట్ల ఆధారంగానే ప్రధాన ప్రతిపక్ష హోదా నిర్దేశితమవుతుందని… ఓట్ల శాతం ఆదారంగా ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కావాలంటే జర్మనీ వెళ్లాలని పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా వేగంగా స్పందించిన జగన్.. పవన్ కల్యాణ్ కార్పొరేటర్ కు ఎక్కువ… ఎమ్మెల్యేకు తక్కువ అంటూ ఘాటు వ్యాఖ్య చేశారు. అంతటితో ఆగని జగన్… జీవిత కాలంలో ఆయన తొలి సారి ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు అంటూ కామెంట్ చేశారు. ఈ సందర్భంగా పవన్ పేరు విన్నంతనే ముఖం చిట్లించేసిన జగన్… ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు కూడా పవన్ పేరును వినడమే తనకు ఇబ్బందిగా ఉందన్న భానవ వచ్చేలా హావభావాలను వ్యక్తం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates