మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించడమేకాదు.. మద్దతు ఇచ్చినప్పుడు.. దానికి తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. కానీ, ఈ విషయంలో వైసీపీ చేసిన తప్పు.. ఆ పార్టీ ప్రతిష్టను మరోసారి మంటగలిపింది. గత ఎన్నికల తర్వాత .. అంతో ఇంతో సానుభూతిని సొంతం చేసుకున్నామని.. ప్రజల్లో కూటమి సర్కారుపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందని.. ఇది తమకు లాభిస్తుందని చెప్పుకొన్న వైసీపీ నాయకులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్ర ఎమ్మె ల్సీ స్థానంలో వైసీపీ మద్దతు పలికిన.. కేఎస్ లక్ష్మణరావు ఘోర పరాజయం చవిచూశారు.
వాస్తవానికి ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ వచ్చే నాటికి వైసీపీ ఎలాంటి స్టాండ్ తీసుకోలేక పోయింది. తర్వాత.. మారిన పరిస్థితులతో వైసీపీ అధినేత జగన్..రెండు జిల్లాల నాయకులతో వేర్వేరుగా, ఉమ్మడిగా రెండు నుంచి నాలుగు సార్లు భేటీ అయ్యారు. “ఆలపాటి రాజాను ఓడించడమే ధ్యేయంగా మనం పనిచేయాలి” అని ఆయన తేల్చి చెప్పారు. అంతేకాదు.. కేఎస్ లక్ష్మణరావు గతంలో వైసీపీకి అనుకూలంగా పనిచేసిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆయనకు అనుకూలంగా పనిచేయాలని నాయకులకు తేల్చి చెప్పారు.
అయితే.. చెప్పడం వరకే పరిమితమైన జగన్.. పార్టీ నాయకులను పర్యవేక్షించలేదన్నది వాస్తవం. నాయకులు ఏమేరకు ప్రచారం చేస్తున్నారో కూడా చూడలేదు. మరోవైపు ఆలపాటి రాజాకు కూటమి బలమైన మద్దతు ఇవ్వడం, ఎన్నికలకు రెండు రోజుల ముందు.. బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి కూడా ఆలపాటికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించడంతో ఆయనకు అన్ని విధాలా కలిసి వచ్చింది. అంతేకాదు.. పట్టభద్రులను కదిలించడంలోనూ కూటమి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అయితే.. ఈ వ్యూహాలకు దీటుగా వైసీపీ పుంజుకోలేక పోయింది.
కానీ, ఎన్నికల సమయంలో మాత్రం కేఎస్‌ను వైసీపీ ఓన్ చేసుకున్నట్టు ప్రకటించింది. ఆయన గెలుపుతో వైసీపీ పుంజుకున్నదన్న భావన వ్యక్తపరచాలని కూడా వైసీపీ అధినేత చెప్పుకొచ్చారు. కానీ, వ్యూహాలు లేకపోవడం.. ప్రజల్లో సానుభూతి ఉందని చెప్పినా..దానిని క్యాష్ చేసుకునే విధంగా వ్యవహరించకపోవడం వంటివి వైసీపీకి భారీ డ్యామేజీని తీసుకువచ్చింది. నిజానికి కేఎస్ గెలిచి ఉంటే.. అది వైసీపీ ఖాతాలో పడి ఉండేది. ఇలా చూసుకుంటే.. ఇప్పుడు ఆయన ఓటమి కూడా పక్కాగా వైసీపీనే భరించాల్సి ఉంటుంది. దీనిని బట్టి గత ఎన్నికల తర్వాత.. కూడా వైసీపీ పుంజుకోలేదనే చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.