నిజమే… టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆసాంతం చదివేశారు. రాజకీయాల్లో తల పండిన చంద్రబాబు.. తన సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నెన్నో ఆటుపోట్లను చవిచూశారు. అందివచ్చిన విజయాలతో పాటుగా ఎదురు వచ్చిన ప్రతి ప్రతిబంధకాన్ని కూడా ఆయన క్షుణ్ణంగానే చదవేశారు. లేకుంటే… విడతల వారీగా ఓ సారి గెలుపు… ఓ సారి ఓటమి ఎలా సాధ్యపడతాయి? ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని చంద్రబాబు విజయాల బాట పట్టారు. ఈ క్రమంలోనే 2019లో తనకు ఎదురైన ఓటమి నేపథ్యంలో… జగన్ మనస్తత్వాన్ని బాబు క్షుణ్ణంగా చదివారు. దానికి విరుగుడు కనిపట్టేసి 2024లో తిరిగి అధికారంలోకి వచ్చేశారు.
ఇదంతా నిజమా? అంటే… అక్షరాలా నిజమండి బాబూ. ఎందుకంటే… ఈ విషయాన్ని వేరే ఎవరో చెప్పలేదు. స్వయంగా చంద్రబాబే పూసగుచ్చినట్టుగా వివరించారు. తన పార్టీ నేతలకు జగన్ గురించి వివరించారు. జగన్ తో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం తర్వాత టీడీఎల్పీ భేటీని నిర్వహించిన చంద్రబాబు… పార్టీ తరఫున కొత్తగా చట్టసభల్లో అడుగుపెట్టిన వారికి చాలా జాగ్రత్తలు చెప్పారు. ఈ సందర్భంగానే జగన్ గుణగణాలను. ఆయనలోని ప్రత్యేకతలు, నైపుణ్యాలను చంద్రబాబు విడమరిచి మరీ వివరించారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కూడా జగన్ నుంచి ముప్పు తప్పదని కూడా చంద్రబాబు పార్టీ నేతలను అప్రమత్తం చేశారు.
ఈ సందర్భంగా జగన్ గురించి చంద్రబాబు ఏమన్నారన్న విషయానికి వస్తే… ”జగన్ తో జాగ్రత్తగా ఉండాలి. జగన్ కుట్రల వల్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలి. సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య, విశాఖలో తనపై జరిగిన కోడికత్తి డ్రామాల నెపాన్ని జగన్ మనపై వేశారు. జగన్ గురించి నాడు మనకు పెద్దగా తెలియదు కాబట్టి.. ఆనాడు మనం అప్రమత్తంగా ఉండలేకయాం. ఫలితంగా ఎన్నికల్లో ఓడిపోయాం. జగన్ కుట్రలను నాటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా పసిగట్టలేకపోయింది. ఇటీవల తాడేపల్లి ప్యాలెస్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలోనూ కుట్ర కోణం ఉంది. అందుకే సీసీటీవీ ఫుటేజీలు అడిగినా వారు ఇవ్వడం లేదు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో నేతలంతా జగన్ తో అప్రమత్తంగా ఉండాలి” అని చంద్రబాబు అన్నారు. ఈ లెక్కన జగన్ గురించి చంద్రబాబుకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదనే చెప్పొచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates