“సంపద సృష్టిస్తాం.. ఆ సంపదను పేదలకు పంచుతాం!” అంటూ ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్త పర్యటనల్లో భాగంగా చెప్పుకొచ్చారు. ఇక, కూటమి సర్కారు వచ్చిన తర్వాత కూడా.. చంద్రబాబు ఇదే మాట పదే పదే చెప్పారు. ఈ నేపథ్యంలో తరచుగా విపక్షాలు.. ‘సంపద సృష్టి’ మాటేంటి? అనే ప్రశ్న వినిపిస్తన్నాయి. ఏ రాష్ట్రానికైనా.. ఏ ప్రభుత్వానికైనా.. సాధారణంగా.. ఖర్చులే ఎక్కువగా ఉంటాయి. సంపద సృష్టించే మార్గాలు చాలా వరకు తక్కువగా ఉంటాయి. దీంతో సంపద సృష్టి అనే కాన్సెప్టు సహజంగానే కొత్తగా ఉంటుంది.
ఇక, తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్‌లో నేరుగా ‘సంపద సృష్టి’ అనే మాట చెప్పకపోయినా.. దీనికి సంబంధించి బలమైన బాటలు పరిచే కార్యక్రమానికి మాత్రం కూటమి సర్కారు శ్రీకారం చుట్టిందనే చెప్పాలి. సంపద సృష్టికి కీలకమైన అంశం.. ‘మూల ధన వ్యయం’. అంటే.. ప్రభుత్వాలకు ఆదాయం చేకూర్చే ప్రాజెక్టులకు కేటాయించే మొత్తం. ఇటీవల కాలంలో ఈ మూల ధన వ్యయానికి ప్రభుత్వాలు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఎందుకంటే.. సంక్షేమానికే ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ప్రజల ఎదురుచూపులు, మళ్లీ ఎన్నికలు వచ్చే సరికి ఇచ్చిన హామీలను అమలు చేయాల్సి రావడంతో మూల ధన వ్యయానికి కేటాయింపులు నానాటికీ తగ్గుతున్నాయి.
దీంతో ప్రభుత్వాలు కేవలం పన్నులపైనే ఆధారపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఏపీ సర్కారు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో మూల ధన వ్యయానికి మెరుగైన కేటాయింపులు జరిగాయి. మూల ధన వ్యయం(అంటే.. సర్కారుకు ఆదాయం తీసుకువచ్చే ప్రాజెక్టులు, పనులు) 40,635 కోట్లరూపాయలకు పైగానే కేటాయించారు. తద్వారా.. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తారు. అంటే.. రహదారుల నిర్మాణాలు, విద్యుత్ సౌకర్యం, తాగునీటి రంగాల అభివృద్ధికి ప్రాధాన్యం పెరుగుతుంది. జగన్ హయాంలో మూల ధన వ్యయం 22 వేల కోట్లకు ఎప్పుడూ మించలేదు. సో.. ఇప్పుడు డబుల్ కేటాయింపులు చేపట్టారు.
ఏం జరుగుతుంది?
మూల ధన వ్యయాన్ని చెప్పింది చెప్పినట్టు కేటాయించి ఖర్చు చేస్తే.. రహదారులు బాగుపడతాయి. తద్వారా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తారు. మారుమూల ప్రాంతాలకు కూడా విద్యుత్ సౌకర్యం పెరుగుతుంది. ఇది కూడా పెట్టుబడులకు అవకాశం కల్పిస్తుంది. అదేసమయంలో రహదారులపై టోల్ గేట్ల ఏర్పాటుతో రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. విద్యుత్ కనెక్షన్ల ద్వారా కూడా రాబడి పెరుగుతుంది. ఇక, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా సాగు పెరిగి.. తద్వారా ఆదాయం వస్తుంది. పెట్టుబడుల కల్పనతో ఉపాధికి ఉపాధి, ఆదాయానికి ఆదాయం కూడా వస్తుంది. కాబట్టి.. ఒకరకంగా.. సంపద సృష్టికి ఈ బడ్జెట్‌లో బీజాలు పడినట్టేనని అంటున్నారు పరిశీలకులు.