తొలి బడ్జెట్ తోనే అదరగొట్టిన పయ్యావుల కేశవ్

టీడీపీలో సీనియర్ నేతగా… ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ కేంద్రంగా రాజకీయం చేస్తున్న ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్… తన తొలి వార్షిక బడ్జెట్ తోనే అదరగొట్టేశారని చెప్పక తప్పదు. వాస్తవానికి గతంలో ఎప్పుడు కూడా పయ్యావుల మంత్రిగా బాధ్యతలు చేపట్టలేదు. చాలా కాలానికి మంత్రి మండలిలోకి ఆయనకు ప్రవేశం లభించింది. అయితే తొలి సారే ఆయనకు ఏకంగా ఆర్థిక శాఖ పగ్గాలు దక్కాయి. ఆ మేరకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని పయ్యావుల వమ్ము చేయలేదనే చెప్పాలి. ఇంకాస్త చెప్పాలంటే… తనపై చంద్రబాబు పెట్టుకున్న నమ్మకాన్ని పయ్యావుల మరింతగా పెంచారని చెప్పక తప్పదు.

టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా.. చాలా సార్లు పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. టీడీపీ హయాంలో అత్యధిక సార్లు ఆయనే బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే పెద్దరికం నేపథ్యం, గోదావరి జిల్లాల స్లాంగ్ కారణంగా ఆయన బడ్జెట్ ప్రసంగం ఏదో అలా సాదాసీదాగా సాగిపోయింది. ఆయా రంగాలకు బడ్జెట్ కేటాయింపుల్లో తనదైన మార్కును చూపడంలో యనమల సత్తా చాటినా… తన ప్రసంగంతో సభను మాత్రం అంతగా ఆకట్టుకోలేకయారన్న వాదనలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక వైసీపీ జమానాలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన డోన్ మాజీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి… బడ్జెట్ కేటాయింపుల పరంగానే కాకుండా… ఏదో వ్యంగ్యాస్త్రాలను సంధిస్తున్నట్లుగా బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించేవారు. అంతేకాకుండా బుగ్గన బడ్జెట్ ప్రసంగం ఆర్థిక శాఖపై పట్టున్న వారికి మాత్రమే అర్థమయ్యేలా ఉందన్న వాదనలూ లేకపోలేదు.

అయితే అటు యనమలను, ఇటు బుగ్గనను పయ్యావుల బీట్ చేశారని చెప్పాలి. ఆర్థిక శాఖపైనే కాకుండా దాదాపుగా అన్ని శాఖలకు చెందిన అంశాలపై సమగ్రమైన అవగాహన పయ్యావుల సొంతం. ఏ శాఖ వ్యవహారాలను అయినా ఆయన ఇట్టే చుట్టేయగలరు. వైసీపీ హయాంలో పీఏసీ చైర్మన్ గా బుగ్గన… జగన్ సర్కారుకు చుక్కలు చూపారు. తాజాగా తన తొలి వార్షిక బడ్జెట్ తో బుగ్గన తనకు తానే సాటి అని చాటుకున్నారని చెప్పాలి. సామాన్యులకు కూడా అర్థమయ్యేలా బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించిన పయ్యావుల… సామాన్యులకు అర్థమయ్యేట్లుగా బడ్జెట్ ను ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా మూల ధన వ్యయం అంటే ఏమిటన్న విషయాన్ని విడమరచి చెప్పిన పయ్యావుల సభ్యులతో పాటు సామాన్య జనం నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. వాగ్ధాటిలో తనకు తానే సాటి అని ఇప్పటికే నిరూపించుకున్న పయ్యావుల… ఎందుకనో గానీ బడ్జెట్ ప్రసంగాన్ని చూసి చదివే క్రమంలో అక్కడకక్కడ కొన్ని పదాలను పలికేందుకు ఇబ్బంది పడటం కనిపించింది.