స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల సమావేశంలో అసలు అజెండా ఏమిటి ? ఈనెల 28వ తేదీన ఎన్నికల నిర్వహణపై స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజకీయపార్టీలతో సమావేశం నిర్వహించారు. ప్రధాన అజెండా ఏమిటంటే కరోనా వైరస్ నేపధ్యంలో ఇపుడు ఎన్నికలు జరపచ్చా ? లేదా ? అన్న విషయంపై ఆయా పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఈ మీటింగ్ పెడుతున్నారు.
మునుపటి కంటే ఎక్కువ కరోనా కేసులున్నా జనాలు పూర్తి అవగాహనతో ఉండటం, మందులు వచ్చేయడం మరణాల రేటు భారీగా తగ్గడం కారణంగా పిల్లలు స్కూలు కూడా ఓపెన్ చేస్తున్నారు. పిల్లల స్కూలే ఓపెన్ చేసినపుడు ఎన్నికల నిర్వహణపై ముందుకు పోవడమే మంచిదనే అభిప్రాయం జనాల్లోను, పార్టీలోను వ్యక్తమవుతోంది.
మరి నిమ్మగడ్డ మనసులో ఏముందో తెలీదు కానీ రాజకీయ పార్టీలతో సమావేశం అయితే పెడుతున్నారు. సరే మరి పై అజెండాతో పాటు మరో అజెండా కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే మార్చిలో ఎన్నికలు జరిగేనాటికి జరిగిన ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని రద్దు చేసి మళ్ళీ మొదటినుండి ఎన్నికలను నిర్వహించాలట. ఇప్పటికే తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు డిమాండ్ మొదలుపెట్టేశారు.
ఇదే డిమాండ్ ను సిపిఐ కార్యదర్శి రామకృష్ణ కూడా అందుకున్నారు. బీజేపీ కూడా ఎన్నికలను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాల్సిందే అంటోంది. వైసీపీ, కాంగ్రెస్, జనసేన, సిపిఎం, నేతలు ఈ విషయమై ఏమీ మాట్లాడటం లేదు. అధికారికంగా మాట్లాడకపోయినా జనసేన కూడా బీజేపీని ఫాలో అయ్యే అవకాశాలే ఎక్కువ. అలాగే వైసీపీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఇక కాంగ్రెస్, సిపిఎంలు ఏమి చెబుతాయో తెలీదు.
మొత్తం మీద రాజకీయ పార్టీల మూడ్ చూస్తుంటే మాత్రం 28వ తేదీ సమావేశంలో పెద్ద రచ్చయ్యే అవకాశలే ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే ఎన్నికలు వాయిదా పడే రోజుకు 660 జడ్పీటీసీ స్ధానాల్లో 126 ఏకగ్రీవమయ్యాయి. అలాగే 10,047 ఎంపిటీసీ స్ధానాల్లో 2663 ఏకగ్రీవమయ్యాయి. ఈ ఏకగ్రీవాలను ఎన్నికల కమీషన్ ఆమోదించటమే కాకుండా ప్రకటించింది కూడా. మరి ఇపుడు వాటిని రద్దు చేయాలని ఎన్నికల కమీషన్ నిర్ణయిస్తే ప్రభుత్వం అంగీకరిస్తుందా ? నిజంగానే వాటిని రద్దు చేస్తే అధికారపార్టీ కోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి. చూడబోతే 28వ తేదీన మీటింగులో ఎన్నికల నిర్వహణకన్నా ఏకగ్రీవాలు రద్దు అంశమే ప్రధాన అజెండా అయ్యేట్లుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates