జ‌గ‌న్ ఇలాకాలో కూట‌మి హ‌వా.. ఏం జ‌రుగుతోంది?!

వైసీపీ అధినేత జ‌గ‌న్ రెండు రోజుల పాటు త‌న సొంత జిల్లా క‌డ‌ప‌లో ప‌ర్య‌టించారు. ఆ సంద‌ర్భంగా పులి వెందుల పంచాయ‌తీని ఒక కొలిక్కి తీసుకు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో వైసీపీ ప‌ట్టు కోల్పోతోంది. ముఖ్యంగా బ‌ల‌మైన తిరుప‌తి, తుని వంటి ప్రాంతాల్లో నూ వైసీపీ స‌భ్యులు పార్టీ మారి.. కూట‌మికి జై కొట్ట‌డంతో స్థానికంలో టీడీపీ జెండా లేదా జ‌న‌సేన జెండా ఎగుతోంది. ఈ ప‌రిణామాల తో రాష్ట్ర వ్యాప్తంగా కేడ‌ర్ ఉక్కిరి బిక్కిరికి గుర‌వుతోంది.

మ‌రోవైపు.. కొన్నికొన్ని ప్రాంతాల్లో అయితే.. జెండా మోసే నాయ‌కుడు కూడా లేకుండా పోయారు. అంతేకాదు.. పార్టీ నేత‌లు కూడా డీలా ప‌డ్డారు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితి ఇంత త్వ‌ర‌గా వ‌స్తుంద‌ని పార్టీ నాయ‌కులు అస్స‌లు ఊహించ‌లేదు. దీంతో స‌ర్దుబాటు, దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు శ్రీకారం చుట్టారు. అయిన‌ప్ప‌టికీ.. ఈ ప‌రిణామాలు ఎక్క‌డా స‌ర్దుబాటు కావ‌డం లేదు. అనేక మంది నాయ‌కులు ఇంకా సుప్త‌చేత‌నావ‌స్థ‌లోనే ఉన్నారు.

దీనిని స‌రిదిద్దేందుకు జిల్లాల ప‌ర్య‌ట‌న చేస్తాన‌న్న జ‌గ‌న్‌.. మ‌రోసారి వాటిని వాయిదా వేశారు. ఇదిలా వుంటే.. సొంత జిల్లాలోనే కూసాలు క‌దిలిపోయే ప్ర‌మాదం పొంచి ఉంద‌ని పార్టీ వ‌ర్గాలుచెబుతున్నాయి. గ‌త వారం ప‌దిరోజుల్లోనే క‌డ‌ప‌లో ప‌రిణామాలు తీవ్రంగా మారిపోయాయి. మ‌రీ ముఖ్యంగా పులివెందుల మునిసిపాలిటీలో ఒక కీల‌క కౌన్సిలర్ ఇటీవ‌ల కుటుంబంతో స‌హా .. టీడీపీకి జై కొట్టారు. ఇక‌, పులివెందుల‌లో పాగా వేసేందుకు టీడీపీ నేత బీటెక్ ర‌వి కూడా.. ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు.

త్వ‌ర‌లోనే ముగ్గురు నుంచి ఐదుగురు వైసీపీ కౌన్సిల‌ర్లు పార్టీ మారే అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ కూడా జోరుగా సాగుతోంది. ఈ నేప‌థ్యంలో సొంత నియోజ‌క‌వ‌ర్గం.. సొంత జిల్లాలోనే ఇలాంటి ప‌రిస్థితి ఏర్ప‌డితే.. భ‌విష్య‌త్తులో ఎదురయ్యే ప‌రిణామాల‌ను ఎదిరించ‌డం క‌ష్ట‌మ‌ని భావించిన జ‌గ‌న్ అనూహ్యంగా పులివెందుల ప‌ర్య‌ట‌న పెట్టుకున్నారు. త‌న‌కు చేరువలో ఉన్న సీనియ‌ర్ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. అంద‌రూ క‌లిసి ఉండాల‌ని.. పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని తేల్చి చెప్పారు. మ‌రి ఎంత వ‌ర‌కు జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు స‌క్సెస్ అవుతాయో చూడాలి.