నాగబాబుకు టైం వచ్చేసిందబ్బా!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన కల్యాణ్ సోదరుడు కొణిదెల నాగేంద్రబాబు అలియాస్ నాగబాబు త్వరలోనే ఏపీ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి. వచ్చే నెలలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబు ఎమ్మెల్సీగా పెద్దల సభలో అడుగుపెట్టడం ఖాయమేనని చెప్పాలి. అంతేకాకుండా ఎమ్మెల్సీగా పదవి చేపట్టిన మరుక్షణమే ఆయనను టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన కేబినెట్ లోకి తీసుకోవడం కూడా లాంఛనమేనన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ముగ్గురు ఎంపీలతో ఖాళీ అయిన 3 రాజ్యసభ సీట్లలో ఓ సీటును జనసేన కోరింది. దాని ద్వారా నాగబాబును రాజ్యసభకు పంపాలని పవన్ భావించారు. అయితే వైసీపీకి రాజీనామా చేసిన వారు టీడీపీ, బీజేపీల్లో చేరిపోవడం…వారిలో ఇద్దరిని తిరిగి రాజ్యసభకు నామినేట్ చేయాల్సి రావడం, మిగిలి ఉన్న ఒకే ఒక్క సీటు కోసం టీడీపీలో భారీ డిమాండ్ ఉండటంతో అది కుదరలేదు. ఈ విషయంపై పవన్ తో చర్చించిన చంద్రబాబు… నాగబాబును ఎమ్మెల్సీగా పంపి కేబినెట్ లోకి తీసుకుందామని చెప్పారు. ఈ ప్రతిపాదనకు పవన్ కూడా ఓకే అన్నారు.

తాజాగా ఏపీ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలోని 5 ఎమ్మెల్సీ సీట్లకు మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. ఖాళీ కానున్న 5 సీట్లలో నాలుగు సీట్లు టీడీపీవి కాగా… మరొకటి వైసీపీ కోటాలోనిది. అయితే ఆ వైసీపీ సీటు కూడా వైసీపీని వీడిన జంగా కృష్ణమూర్తి రాజీనామాతో ఖాళీ అయిన సీటు. టీడీపీ కోటా సీట్లను టీడీపీ సభ్యులకే కేటాయించినా… వైసీపీ కోటా సీటును జనసేనకు కేటాయించే అవకాశాలున్నాయి. ఇటీవల ఓ రాజ్యసభ సీటు దక్కిన నేపథ్యంలో బీజేపీ కూడా ఈ ప్రతిపాదనకు అడ్డు చెప్పే అవకాశం లేదు. 11 సీట్లు మాత్రమే ఉన్న వైసీపీ అసలు ఈ ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్సే లేదు. వెరసి 5 సీట్లూ కూటమి ఖాతాలోనే పడనున్నాయి. ఈ లెక్కన జనసేన తరఫున నాగబాబు ఎమ్మెల్సీగా పోటీ చేయడం, ఎమ్మెల్సీగా గెలవడం నల్లేరుపై నడకే. ఆ వెంటనే ఆయనకు కేబినెట్ లో స్తానం దక్కడం లాంఛనమే.