వైసీపీకి త్వరలోనే మరో భారీ ఎదురు దెబ్బ తగలనుందా? ఆ పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న ఎమ్మెల్సీ ఒకరు జంప్ చేసేందుకు లైన్ క్లియర్ అయిందా? సదరు నేత జనసేనలోకి వెళ్లిపోతున్నారా? అంటే.. ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆయనే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తోట త్రిమూర్తులు. ప్రస్తుతం వైసీపీ నాయకుడిగా ఉన్న ఆయన గతంలో మండపేట నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా 2014లో విజయం దక్కించుకున్నారు.
ఆ తర్వాత.. టీడీపీలో చేరారు. ఇక, 2019లో టీడీపీ తరఫున పోటీ చేసినా.. ఓడిపోయారు. ఈ క్రమంలోనే 2021లో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన తోటకు బలమైన కేడర్ ఉందని అంటారు. అదేసమయంలో ఆయన ఫైర్ బ్రాండ్ నాయకుడిగా కూడా చలామణి అయ్యారు. ఈ క్రమంలో టీడీపీని దెబ్బకొట్టేందుకు జగన్ వేసిన వ్యూహంలో భాగంగా తోటకు.. ఎమ్మెల్సీ సీటు ఆఫర్ చేశారు. ప్రస్తుతం తోట ఎమ్మెల్సీగా ఉన్నారు.
అయితే.. వైసీపీ ఓడిపోయిన దరిమిలా.. ఆయన పార్టీకి అంటీముట్టనట్టు ఉన్నారు. పైగా.. మండలి సమా వేశాలకు కూడా ఆయన గైర్హాజరు అవుతున్నారు. ఇదిలావుంటే.. ఈయన వియ్యంకుడు.. వైసీపీ మాజీ నాయకుడు.. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన సామినేని ఉదయ భాను.. ప్రస్తుతం జనసేనలో ఉన్నారు. గతంలో జగన్‌కు, వైఎస్‌కుటుంబానికి సామినేని అత్యంత ఆప్తుడిగా ఎదిగారు. వైసీపీ ఓడిపోయిన దరిమిలా.. తనను ఓడించేందుకు వైసీపీ ప్రయత్నించిందని ఆరోపిస్తూ.. ఆయన పార్టీకి రాజీనామా చేశారు.
ఈ క్రమంలోనే జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఇక, అప్పటి నుంచి తోట త్రిమూర్తులను జనసేనలోకి చేరేలా సామినేని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ, తోటపై ఎస్సీ ఎస్టీ కేసు ఉంది. కొన్నాళ్ల కిందట స్థానిక కోర్టు ఆయనను దోషిగా కూడా పేర్కొంటూ శిక్ష విధించింది. అయితే.. దీనిని పైకోర్టులో సవాల్ చేయడంతో ఆయన ఇప్పుడు సేఫ్‌గా ఉన్నారు. ఈ క్రమంలో జనసేనలో చేరే ప్రక్రియకు తోట కూడా అంగీకరించినట్టు మండపేట వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే జనసేన తీర్థం పుచ్చుకోవడం ఖాయమని.. తెరవెనుక అంతా సామినేని చక్రం తిప్పారని తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates