తెలంగాణ‌లో ర‌గ‌డ‌.. ఏపీలో ప్ర‌శాంతం.. విష‌యం ఏంటంటే!

ఏపీ, తెలంగాణ‌ల్లో గురువారం ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ జ‌రుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నూ.. మూడు మూడు చొప్పున ఎమ్మెల్సీ స్థానాల‌కు పోలింగ్ సాగుతోంది. గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ స్థానానికి ప్ర‌క్రియ న‌డుస్తోంది. అయితే.. తెలంగాణ‌లో వివాదాలు చుట్టుముట్టాయి. ప‌లు చోట్ల బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల మ‌ధ్య విభేదాలు, కొట్లాట‌లు, నిర‌స‌న‌లు తెర‌మీదికి వ‌చ్చాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.

కానీ, ఏపీలో మాత్రం ఉద‌యం 12 గంట‌ల స‌మ‌యానికి అంతా ప్ర‌శాంతంగా సాగిపోతోంది. అంతేకాదు.. తెలంగాణ‌లో ఉద‌యం 12 గంట‌ల‌కు 22 శాతం పోలింగ్ న‌మోదు కాగా.. ఏపీలో 34 శాతం పోలింగ్ న‌మోదై న‌ట్టు అధికారులు తెలిపారు. అంతా బాగానే జ‌రుగుతోంద‌న్నారు. అయితే.. ఏపీలో ఓటు వేసేవారు మంద‌కొడిగా బూతుల‌కు వ‌స్తున్నారు. చాలా అంటే చాలా త‌క్కువ మంది ఉన్నారు. ఉదాహ‌ర‌ణ‌కు కృష్ణ‌జిల్లాలో 65 వేల మందికి పైగా ఓట‌ర్లు ఉన్నారు.

కానీ, ఉద‌యం 12 గంట‌ల స‌మ‌యానికి కేవ‌లం 11 వేల మంది మాత్ర‌మే ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. ఇది పోటీలో ఉన్న అభ్య‌ర్థుల‌కు స‌వాలుగా మారింది. పైగా పోటీ తీవ్రంగా ఉండ‌డంతో అభ్య‌ర్థులు మ‌థ‌న ప‌డుతున్నారు. ఇక‌, తెలంగాణ విష‌యానికి వ‌స్తే.. ఓట‌ర్లు పోటెత్తుతున్నారు. క‌రీంన‌గ‌ర్‌లోని బూతుల వ‌ద్ద ఓట‌ర్లు బారులు తీరిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇక‌, ఇక్క‌డ బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్ మ‌ధ్య ర‌గ‌డ చోటు చేసుకుంది.

మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాల్టీ పరిధిలోని తీగల్ పహాడ్ పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ -కాంగ్రెస్ వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ పెడుతున్నారంటూ.. బీజేపీ నేత‌ల‌పై కాంగ్రెస్ నేత‌లు ఆరోపించారు. కాదు.. మీరే ప్ర‌లోభాల‌కు గురి చేస్తున్నారని బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఇది వివాదానికి దారి తీసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్ర‌మంలో బీజేపీ నేతపై ఎస్ఐ చేయి చేసుకున్నాడని కార్యకర్తలు ఆందోళన వ్య‌క్తం చేశారు. బీజేపీ కార్యకర్తలపై దూసుకెళ్ళిన కాంగ్రెస్ నేతలు.. వారితో బాహాబాహీకి దిగారు. దీనిని అదుపు చేసేందుకు పోలీసులు స్వ‌ల్ప లాఠీచార్జీ చేయ‌డం గ‌మ‌నార్హం.