ఏపీలోని కూటమి ప్రభుత్వం పెట్టుబడులు రాబట్టే క్రమంలో కీలక ముందడుగు వేసింది. తద్వారా ఉపాధి, ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్నికలకు ముందు ప్రకటించిన ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలను సాధించే దిశగా ప్రభుత్వం వడివడిగా పరుగులు పెడుతోంది. తాజాగా అంబానీ నేతృత్వంలోని రిలయెన్స్ తో చేసుకున్న ఒప్పందం సాకారం దిశగా ముందుకు సాగుతోంది. రిలయెన్స్ ఇండస్ట్రీస్ నేతృత్వంలో రాష్ట్రంలో 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన ఒప్పందం పూర్తయింది. ప్రస్తుతం భూములు కూడా కేటాయించారు.
మార్చి నుంచి పనులు చేపట్టి.. వచ్చే రెండు మాసాల్లోనే నియామకాలు చేపట్టే దిశగా రిలయెన్స్ కూడా అడుగులు వేయనుంది. ఈ ఒప్పందం ఫలితంగా రిలయెన్స్ సంస్థ ఏపీలోని కరువు జిల్లాలుగా పేరు పడ్డ ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో బయో గ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి 65 వేల కోట్ల రూపాయలను రిలయెన్స్ పెట్టుబడి పెట్టనుంది. ఇది విడతల వారీగా కాకుండా.. ఒకేసారి పెట్టుబడి పెట్టేందుకు సంస్థ గతంలోనే సర్కారుతో ఒప్పందం చేసుకుంది. ఈ ప్లాంట్ల ఏర్పాటుతో కరువు నేలల కారణంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలులేని.. సుమారు 2.5 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
కనీసం డిగ్రీ పూర్తి చేసిన వారికి సంస్థలో ఉద్యోగాలు లభిస్తాయి. ఇక, విద్యార్హతలతో సంబంధం లేకుండా.. ఇతరులకు ఉపాధి లభించనుంది. తొలి దశలో ప్రకాశం జిల్లా కనిగిరి, పల్నాడు జిల్లాలని సత్తెనపల్లి, వినుకొండ, గురజాల నియోజకవర్గాల్లో బయో గ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. “రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్“ ద్వారా ఈ ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తారు. ఇక, ఈ ప్లాంట్ల ఏర్పాటుకు కొరగాని భూములనే ప్రభుత్వం కేటాయిస్తోంది. బంజరు భూములను సంస్థకు కేటాయించారు.
మొత్తంగా 4 వేల ఎకరాలను రిలయన్స్ కు లీజుకు ఇవ్వనున్నారు. ప్రభుత్వ భూములు అయితే.. ఏడాదికి రూ.15 వేలు, ప్రైవేటు భూములు అయితే ఏడాదికి రూ.30 వేల చొప్పున లీజుకు ఇచ్చే ప్రతిపాదనకు ఏపీసర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ భూములను రైతుల నుంచి సేకరించేందుకు 15 రోజుల గడువు ఇస్తూ.. ఆయా జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, వీటిని లీజుకు తీసుకున్నాక.. రిలయెన్స్ సంస్థ గడ్డిని పెంచి.. దాని నుంచి బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేయనుంది. వినియోగం, రవాణా తదితర వాటిని కూడా.. ఏపీలోనే నిర్వహించేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం గమనార్హం.