వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్.. తన సొంత నియోజకవర్గానికి రూ.10 కోట్లు ఖర్చు చేసి అత్యాధుని కంటి వైద్యశాలను నిర్మించారు. దీనిని తాజాగా మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆయన ప్రారంభించారు. తొలుత ఆయన కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో పరిమితంగానే వైఎస్ కుటుంబ సభ్యులకు ఆహ్వానాలు అందడం గమనార్హం. మరీ ముఖ్యంగా జగన్ తన మాతృమూర్తి విజయమ్మను పిలకపోవడం సర్వత్రా విస్మయానికి దారి తీసింది.
‘వైఎస్సార్ ఫౌండేషన్’ పేరుతో వైసీపీ ఆధ్వర్యంలో కడపలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనికి పార్టీ సహా.. వైఎస్ కుటుంబ సభ్యులు.. ఇతర దాతల నుంచి కూడా.. నిధులు సేకరిస్తున్నారు. ఇలా వచ్చిన నిధుల నుంచి రూ.10 కోట్లు వెచ్చించి.. పులివెందులలో అత్యాధుని వైద్య సౌకర్యాలతో స్థానికులకు ఉప యోగపడేలా .. వైద్య ఆసుపత్రి నిర్మాణానికి రెండేళ్ల కిందట వైసీపీ హయాంలోనే శంకుస్థాపన చేశారు. ఇది పూర్తయింది. ఈ నేపథ్యంలో తాజాగా కడప పర్యటనలో ఉన్న జగన్ దీనిని ప్రారంభించారు.
తొలుత ఆయన కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు ‘అద్దాలు’ పడతాయని వైద్యులు చెప్పారు. అయితే.. లేజర్ ట్రీట్ మెంటు తీసుకుంటానని.. అద్దాలు అవసరం లేదని జగన్ చెప్పడంతో లేజర్ ట్రీట్ మెంటు కోసం వైద్యులు రిఫర్ చేశారు. స్థానికులు పెద్ద ఎత్తున ఈ ఆసుపత్రికి వచ్చి.. వైద్య పరీక్షలు చేయించుకోవడంతోపాటు.. ఉచితంగా ఆపరేషన్లకు కూడా నమోదయ్యారు. ఈ ఆసుపత్రిలో కంటి పరీక్షల నుంచి ఆపరేషన్ల వరకు అన్నీ ఉచితంగా చేయనున్నట్టు వైద్యులు తెలిపారు.
ఇక, వైఎస్సార్ ఫౌండేషన్ పేరుతో నెలకొల్పిన ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి కేవలం జగన్ ఒక్కరే హాజరయ్యారు. చివరకు ఆయన మాతృమూర్తి వైఎస్ సతీమణి విజయమ్మకు కూడా ఆహ్వానం అందలేదని సమాచారం. దీంతో ఆమె ఎక్కడా ఈ కార్యక్రమంలో కనిపించలేదు. మరోవైపు వైఎస్ కుటుంబానికి చెందిన వారిలో చాలా తక్కువ మందే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.