‘లూప్’ జర్నీ…బాబు ఎప్పుడో చెప్పేశారబ్బా

అది 2019కి ముందు నాటి మాట. ఏపీకి నూతన రాజధాని అమరావతి పనులు శరవేగంగా సాగుతున్న సమయం. అమరావతిని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో అనుసంధానం చేయాలన్న దిశగా నేటి మాదిరే నాడు కూడా ఏపీకి సీఎంగా కొనసాగుతున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా ఒకానొక రోజు ఆయన నోట హైపర్ లూప్ మాట వినిపించింది. వలయాకారంలో ఏర్పాటయ్యే గొట్టాల్లాంటి రవాణా వ్యవస్థలో అతి తక్కువ పీడనంతో అత్యంత వేగంగా ప్రయాణం సాగించవచ్చన్న దిశగా అప్పుడప్పుడే మొదలైన పరిశోధనలను బాబు అప్పుడే ప్రస్తావించారు. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే… అమరావతి నుంచి అనంతపురమే కాదు… విశాఖ నుంచి అనంతపురం కూడా రెండు నుంచి మూడు గంటల్లోనే చేరుకోవచ్చని ఆయన అన్నారు.

కట్ చేస్తే… కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంగళవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో హైపర్ లూప్ ట్రావెలింగ్ లో ఓ కీలక మైలురాయిని ప్రస్తావించారు. లూప్ మార్గంలో రైల్వే ట్రాన్స్ పోర్టుకు సంబంధించి ఐఐటీ మద్రాస్ రూపొందించిన ఓ నూతన ఆవిష్కరణ గురించి ఆయన ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రైవేటు రంగ దిగ్గజాలు ఎల్ అండ్ టీ, హిందాల్కో వంటి కంపెనీ సహకారంలో ఐఐటీ మద్రాస్ కు చెందిన పరిశోధకులు… 422 మీటర్ల మేర లూప్ రైల్వే ట్రాక్ ను సిద్ధం చేశారు. ప్రయోగాత్మకంగా పరిశీలన కోసమే ఏర్పాటు చేసిన ఈ మార్గంలో రైల్వే రవాణాను పరిశీలించి.. ఈ వ్యవస్థను మరింతగా అభివృద్ధి చేయనున్నట్లుగా వైష్ణవ్ ప్రకటించారు.

నాడు బాబు చెప్పిన మాటలనే నేడు వైష్ణవ్ నోట కూడా వినిపించాయి. అమరావతి నుచి అనంతపురానికి రెండు గంటల్లో చేరుకోవచ్చంటూ నాడు బాబు చెబితే.. ఢిల్లీ నుంచి 300 కిలో మీటర్ల దూరంలో ఉండే జైపూర్ కు కేవలం అరగంటలో చేరుకోవచ్చంటూ నేడు వైష్ణవ్ చెప్పుకొచ్చారు. నాడు లూప్ ప్రయోగాలు ప్రాథమిక దశలో ఉండగా…ఈ వ్యవస్థలో గరిష్ట వేగం గంటకు 600 కీలో మీటర్లుగా నాడు అంచనా వేస్తే… ఆ ప్రయోగాలు మరింత ముందుకు సాగిన ప్రస్తుత తరుణంలో ఈ వేగం ఏకంగా డబుల్ అయిపోయింది. హైపర్ లూప్ పూర్తిగా అభివృద్ధి చెందితే… గంటకు 1,200 కిలో మీటర్ల వేగంతో దూసుకుపోవడం వీలవుతుంది. అంటే… బెంగళూరు, చెన్నైల మధ్య దూరంగా 300 కిలో మీటర్లు అయితే… దానిని కేవలం 15 నిమిషాల్లో చేరుకోవచ్చన్న మాట.

ఈ లెక్కన హైపర్ లూప్ రవాణా వ్యవస్థ మొత్తం ప్రపంచ గతినే సమూలంగా మార్చివేయనుందని చెప్పక తప్పదు. ప్రస్తుతం ఈ తరహా వ్యవస్థ ఏ దేశంలో కూడా అందుబాటులో లేదు గానీ… త్వరలోనే ఎక్కడో ఒక చోట పరిమితంగానైనా ఈ వ్యవస్థ అందుబాటులోకి రావడం అయితే ఖాయమే. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే… అన్ని దేశాల కంటే ముందుగా భారత్ లోనే ఈ నూతన రవాణా వ్యవస్థ పట్టాలెక్కినా ఆశ్చర్చపోవాల్సిన పని లేదన్న వాదనలూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇదే జరిగితే… బాబు చెప్పినట్లుగానే… ఏపీలోనూ ఈ వ్యవస్థ ఏర్పాటుకు త్వరలోనే అడుగులు పడతాయని చెప్పొచ్చు. టెక్నాలజీలో వస్తున్న మార్పులను నిత్యం పర్యవేక్షిస్తూ సాగే చంద్రబాబు… దీనిని ఏపీకి త్వరితగతిన తీసుకువస్తారని కూడా చెప్పవచ్చు.