సోషల్ మీడియాలోకి మంగళవారం ఎంట్రీ ఇచ్చిన ఓ ఫొటో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో చూడటానికి పెద్దగా ఏమీ లేదు కూడా. అయినా కూడా ఆ ఫొటో చూస్తునే ఓ వైబ్రేషన్ ఇట్టే వచ్చేస్తోంది. అయినా అందులో ఏముందంటారా? ఏమీ లేదండి… టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఒంటరిగా అసెంబ్లీలో నిలబడి ఉన్నారు. చేతిలో ఏవో పేపర్లు ఉన్నాయి. సభకు చంద్రబాబు వెళితే.. నిత్యం ఆయన వెనుక కనీసం ఓ 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు అయినా ఉంటారు. అయితే ఆ ఫొటోలో ఒక్కరంటే ఒక్కరు కూడా బాబు వెనుక లేరు. చంద్రబాబు ఒక్కరే నిలబడి ఉన్నారు. అయితేనేం… ఏమాత్రం బెరుకు లేకుండానే చంద్రబాబు ఏదో అంశం మీద మాట్లాడుతూ ఉన్నారు.
ఈ ఫొటోను ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ పృధ్వీరాజ్ మంగళవారం మద్యాహ్నం తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఏపీలో 2019 ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 ఎమ్మెల్యే సీట్లనే గెలుచుకుంది. అందులోనూ నలుగురు దాకా ఎమ్మెల్యేలు వైసీపీకి దగ్గరైపోయారు. అంటే… నాడు టీడీపీ బలం 20 కంటే తక్కువే. అయినా కూడా ఏనాడూ వెన్ను చూపని టీడీపీ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే సాగింది. ఇలాంటి సమయంలో ఒకానొక సందర్భంలో టీడీపీ సభ్యులందరినీ స్పీకర్ సస్సెండ్ చేశారు. ఒక్క చంద్రబాబును మాత్రం మినహాయించారు. అంటే. చంద్రబాబు వెంట ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే కూడా నిలబడకుండా చేశారన్న మాట.
అయితేనేం… ఏమాత్రం తొట్రుపాటు లేకుండా 151 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న అదికార వైసీపీ శిబిరాన్ని చూసి చంద్రబాబు భయపడిపోలేదు. ఓ వైపు అంబటి రాంబాబు లాంటి వారి నుంచి రన్నింగ్ కామెంట్రీ లాంటి హేళన వ్యాఖ్యలు వినిపిస్తున్నా కూడా చంద్రబాబు వెనక్కు తగ్గలేదు. ఆ సమయంలో జరుగుతున్న చర్చలో పాలుపంచుకునేందుకే ఆయన సిద్ధపడ్డారు. అప్పటికే ఆ చర్చకు అవసరమైన పేపర్లతోనే సభకు వచ్చిన చంద్రబాబు… అవే పేపర్లను చేతబట్టుకుని చంద్రబాబు అలా ప్రసంగిస్తూ సాగిపోయారు. ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం అంటే ఇదేనన్న రీతిలో నాడు చంద్రబాబు వ్యవహరించారు. ధీరోదాత్తుడిగా నిలిచారు. భవిష్యత్తు తరాల నేతలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు.
ఇదే విషయాన్ని పృథ్వీ కూడా ప్రస్తావించారు. వైసీపీ జమానాలో టీడీపీ సభ్యులందరూ సస్సెండ్ కాగా… ఒంటరిగా నిలబడ్డా చంద్రబాబు వెనుదిరగలేదని ఆయన కీర్తించారు. ఒంటరిగానే పార్టీ గొంతుకగా, ప్రజా గళంగా మారారని కూడా పృథ్వీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందుకే భావి తరాలకు చంద్రబాబు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని ఆయన కొనియాడారు. విచిత్రమేమిటంటే… జగన్ ఫ్యామిలీ నేతృత్వంలో నడుస్తున్న సాక్షి మీడియాలో ప్రసారం అయిన చంద్రబాబు నాటి ఫొటోను పృథ్వీ షేర్ చేసి తన వెరైటీని చాటుకున్నారు. కుర్చీలన్నీ ఖాళీగా కనిపిస్తున్నా..చంద్రబాబు అలా ధైర్యంగా నిలిచిన ఫొటోపైన సాక్షి లోగో చాలా స్పష్టంగా కనిపిస్తుండటం గమనార్హం.
ఈ ఫొటోను చూసినంతనే సోమవారం నాటి అసెంబ్లీ దృశ్యాలు ఒక్కసారిగా జనం మదిలో మెదిలాయి. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ బలం 11కే పరిమితం అయ్యింది. జగన్ కాకుండా ఓ 10 మంది మాత్రమే వైసీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాదించారు. జగన్ ను కలుపుకుంటే… వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 11కు చేరుతుంది. నాడు చంద్రబాబు సింగిల్ గానే అసెంబ్లీలోనే నిలిచి ప్రజా సమస్యల కోసం పోరాడితే… ఇప్పుడు 10 మంది సభ్యుల తోడు ఉండి కూడా జగన్ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి హాజరవుతానని చెబుతున్న తీరుపైనా చర్చ జరిగేలా ఈ ఫొటో చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.