సోమిరెడ్డి గారూ.. ‘సందడి’ లేదండి!

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రసవత్తరంగా సాగుతాయని… కూటమి సర్కారును విపక్ష వైసీపీ కడిగిపారేస్తుందని.. వైసీపీ చేసే వాదనలను కూటమి తుత్తునీయలు చేస్తుందని అంతా ఆశించారు. ఆ మేరకే…సోమవారం నాటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఏపీ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలు కూడా మధ్యాహ్నం దాకా టీవీలకు అతుక్కుపోయాయి. అయితే వారి ఆశలన్నీ అడియాశలే అయిపోయాయి. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతుందనుకున్న వైసీపీ తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వరంటూ పాత పాట పాడేసి అసెంబ్లీ సమావేశాలకు ఇక రాబోమంటూ చెప్పేసి వెళ్లిపోయింది. గవర్నర్ ప్రసంగం ముగియగానే.. కూటమి పార్టీలు కూడా ఇంటికెళ్లాయి.

మంగళవారం నాటి సమావేశాలకు కూటమి పార్టీల ఎమ్మెల్యేలు మాత్రమే సభకు రాగా… వైసీపీ వారు మాత్రం వారి పనుల్లో బిజీ అయిపోయి అసెంబ్లీ వైపు కన్నెత్తి చూడలేదు. ఇక శాసనమండలికి వచ్చిన వైసీపీ ఎమ్మెల్సీలు కూటమి పార్టీలకు చెందిన మంత్రుల ఎదురు దాడికి బెంబేలెత్తి మధ్యాహ్నానికే ఇంటికెళ్లిపోయారు. ఫలితంగా ఇటు అసెంబ్లీతో పాటుగా అటు కౌన్సిల్ లోనూ కూటమి పార్టీల ప్రకటనలు, కీలక అంశాల ప్రస్తావనలు తప్పించి… వాడీవేడీ చర్చలు లేకుండాపోయాయి. అయినా విపక్షం లేకుండా జరిగే సమావేశాలను ఏ టీవీ ఛానెల్ అయినా ఎందుకు ప్రసారం చేస్తుంది? అందుకే టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పినట్టుగా సందడి అన్నదే కనిపించడం లేదు.

సోమవారం నాటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైసీపీ వైఖరిపై సోమిరెడ్డి నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రజల్లో తమకు 40 శాతం మంది ఓట్లేశారని చెబుతున్న వైసీపీ… ఆ 40 శాతం ప్రజల సమస్యలపై అయినా చర్చించేందుకు అసెంబ్లీకి రావాలి కదా అని ఆయన వ్యాఖ్యానించారు. విపక్షమన్నది లేకుండా జరిగే సభల్లో సందడే ఉండదని కూడా ఆయన అన్నారు. కనీసం సందడి కోసమైనా వైసీపీ సభ్యులు సభకు రావాలంటూ ఆయన అభిప్రాయపడ్డారు. అయినా నిబంధనల మేరకు దక్కే ప్రధాన ప్రతిపక్ష హోదాను సాకుగా చూపి అసెంబ్లీ సమావేశాలను బాయికాట్ చేయడం ఏమీ బాగోలేదని కూడా సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. వైసీపీ సభ్యులు లేకపోవడంతో కొరవడిన సందడిని తిరిగి తీసుకువచ్చేలా చేయాలని జనం సోమిరెడ్డిని కోరుతున్నారు.