తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం అయిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడేసి స్థానాలకు జరగనున్న ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో బరిలో ఉన్న పార్టీలన్నీ తమ అభ్యర్థుల విజయం కోసం పక్కా వ్యూహాలు అమలు చేస్తున్నాయి. తెలంగాణలో రెండు టీచర్, ఓ గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు జరగనుండగా… ఏపీలో రెండ గ్రాడ్యుయేట్, ఓ టీచర్ స్థానానిక ఎన్నికలు జరుగుతున్నాయి. టీచర్ స్థానాలను పక్కనపెడితే… గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకునేందుకు రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. తెలంగాణలో ఒకింత టఫ్ ఫైట్ నడుస్తున్నా… ఏపీలో విపక్షం బరిలో లేకపోవడంతో అధికార టీడీపీ అభ్యర్థుల విజయం నల్లేరుపై నడకేనన్న దిశగా ఊహాగానాలు సాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఉమ్మడి ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆయా ప్రాంతాలకు చెందిన కూటమి నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు.. పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దిగిన పేరాబత్తుల రాజశేఖరం, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ల విజయావకాశాలపై ఆయన దృష్టి సారించారు. విపక్షం బరిలో లేకపోవడం, రెండు స్థానాల పరిధిలోని జిల్లాలు టీడీపీకి కంచుకోటలుగా ఉన్న నేపథ్యంలో అటు పేరాబత్తుల, ఇటు ఆలపాటి విజయాలపై ఎలాంటి అనుమానాలు లేవని నేతలు లోకేశ్ కు తెలియజేశారట. ఈ సందర్భంగా లోకేశ్ నేతలకు ఓ అంశాన్ని పదే పదే చెప్పి పంపారట.
ఎన్నికల బరిలోకి దిగిన పార్టీ అభ్యర్థులు ఇద్దరూ తొలి ప్రాధాన్యతా ఓటుతోనే విజయం సాధించి తీరాలని లోకేశ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారట. ఆ విజయం కూడా రికార్డు మెాజారిటీ దిశగా కూడా ఉండాలని ఆయన సూచించారట. పార్టీ అభ్యర్థుల విజయం నల్లేరుపై నడకే అన్నట్లుగా చెబుతున్నారు కదా… మరి ఈ విజయాల్లో సెకండ్ ప్రయారిటీ ఓటు అన్న మాటే తనకు వినిపించరాదని కూడా ఆయన ఓ కండీషన్ పెట్టారట. సెకండ్ ప్రయారిటీ ఓట్లను లెక్కించాల్సి వస్తే… పార్టీ అభ్యర్థులపై పట్టభద్రులకు అంతగా నమ్మకం లేదనే భావించక తప్పదు. ఈ తరహా పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలని లోకేశ్ సూచించారట. అయినా విపక్షం పోటీలో లేకుండా సెకండ్ ప్రయారిటీ ఓటు ప్రస్తావనే ఉండదంటూ పార్టీ నేతలు చెప్పినా… విజయం వరించేదాకా కష్టపడాల్సిందేనని లోకేశ్ చెప్పారట. అప్పుడే పార్టీ అభ్యర్థులకు రికార్డు మెజారిటీలు సాధ్యమవుతాయని ఆయన చెప్పారట.