అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి రోజు సభలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ సభ్యులు సభలో రసాభాస సృష్టించడంపై విమర్శలు వస్తున్నాయి. రాని ప్రతిపక్ష హోదా కావాలని సభలో పట్టుబట్టడం, వాకౌట్ చేయడం ఏంటని వైసీపీ నేతలను కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు.
గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ సభ్యులు నినాదాలు చేయడం, అరుపులు, కేకలు సబబు కాదని పవన్ అన్నారు. ఇదో లో లెవల్ విధానం అని, వైసీపీ నేతలు ఎదగాలని అన్నారు. గవర్నర్ అంటే గౌరవం లేకుండా ప్రసంగం ప్రతులు చించి వైసీపీ సభ్యులు గొడవ చేయడాన్ని పవన్ ఖండించారు. వైసీపీకి మరో ఈ ఐదేళ్ల పాటు ప్రతిపక్ష హోదా రాదని, అది గుర్తు పెట్టుకోవాలని అన్నారు. ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, కానీ, 11 సీట్లు ఇచ్చారని గుర్తు చేశారు. ఆ 11 సీట్లు గెలిపించిన ప్రజల సమస్యలపై గళం విప్పేందుకు అసెంబ్లీకి రాకుండా ఉంటామని, వచ్చినా గొడవ చేస్తామని అనడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు.
సభ్యుల సంఖ్యను బట్టి వారి స్థాయికి తగినట్లుగా సభలో సమయం ఇస్తారని చెప్పారు. కనీసం, జనసేన కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా వైసీపీకి ప్రతిపక్ష హోదా వచ్చి ఉండేదని, సభలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అని, వైసీపీ కాదని చెప్పారు. అయినా సరే, తమకు ప్రతిపక్ష హోదా కావాలని వైసీపీ గొడవ చేయడం సరికాదని, 11 సీట్లు ఉన్నవారికి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని పవన్ ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా అడిగితే వచ్చేది కాదని చురకలంటించారు.వైసీపీ సభ్యులు బాధ్యతగా వ్యవహరించాలని, వారి వ్యవహార శైలి సరికాదని అన్నారు. వైసీపీ నేతలు వారి స్థాయి పెంచుకోవాలని, సభ నియమాలు, విధానాలు అర్థం చేసుకోవాలని హితవు పలికారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ డిసైడ్ చేసేది కాదని, నియమనిబంధనల ప్రకారమే ప్రతిపక్ష హోదా ఏ పార్టీకైనా వస్తుందని చెప్పారు.