జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రంగంలోకి దిగేంతవరకే… ఒక్కసారి ఆయన రంగంలోకి దిగారంటే పరిస్థితే పూర్తిగా మారిపోతుంది. అది సినిమాలు అయినా.. రాజకీయం అయినా.. ప్రజా సేవ అయినా… ఇంకేదైనా పవన్ తనదైన మార్కుతో సాగిపోతూ ఉంటారు. ప్రస్తుతం పవన్ అటు సినిమాలతో పాటు ఇటు రాజకీయంగా.. మరోవైపు ప్రభుత్వ పాలనలో తనదైన శైలి ముద్రతో సాగిపోతూ ఉన్నారు. అందుకు నిదర్శనంగా ఆదివారం రాత్రి ఆయన అనుసరించిన వ్యవహార సరళి నిలుస్తోంది. సోమవారం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం రాత్రికే పవన్ అమరావతి చేరుకున్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన జనసేన లెజిస్లేచర్ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశం అనంతరం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలోనే పవన్ తన ఎమ్మెల్యేలకు పసందైన విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ నలుగురు, ఐదుగురు ఎమ్మెల్యేలకు ఓ రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రతి రౌండ్ టేబుల్ వద్దకు వెళ్లిన ఆయన.. పార్టీ ఎమ్మెల్యేలతో వన్ టూ వన్ చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాసనసభ్యులు చెప్పిన విషయాలను పవన్ నోట్ బుక్కులో శ్రద్ధగా రాసుకున్నారు. వెరసి తమ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలతో పాటు… ఆయా నియోజకవర్గాలు ఉన్న జిల్లాల సమస్యలు… అక్కడి ప్రజల స్థితిగతులను ఆయన నేరుగా ఎమ్మెల్యేలతోనే చర్చించి నోట్ చేసుకున్న తీరు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. ఓ పార్టీ అధినేతగా… అంతకుమించి డిప్యూటీ సీఎంగా తనకున్న బిజీ షెడ్యూల్ ను కూడా పక్కనపెట్టేసిన పవన్.. ఎమ్మెల్యేలతో వన్ టూ వన్ చర్చలు జరపడం నిజంగానే అందరినీ ఆకట్టుకుంది.
అదేదో సినిమాలో లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా అంటూ పవన్ నోట నుంచి వెలువడే డైలాగ్ ఈ సందర్భంగా జనసేన ఎమ్మెల్యేలకు గుర్తుకు వచ్చిందని చెప్పాలి. ఎంతగా బిజీగా ఉన్నా కూడా పార్టీని నమ్మి పార్టీ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా గెలిపించిన నియోజకవర్గాల ప్రజల సమస్యలను ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేల నుంచి తెలుసుకోవడం… వాటిని పెన్ను చేతబట్టి పేపర్ పై శ్రద్ధగా రాసుకున్న తీరు నిజంగానే ఎమ్మెల్యేలను మంత్రముగ్ధులను చేసిందని చెప్పాలి. సరే.. పార్టీ తరఫున పరిమిత సంఖ్యలోనే ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి… ఇలా వన్ టూ వన్ మీటింగ్ లు కుదిరాయి గానీ.. భవిష్యత్తులో పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య పెరిగితే.. అన్న ప్రశ్నలు వినిపించినా… అప్పుడు తమ నేత మరికొంత ఎక్కువ సమయం కేటాయిస్తారు తప్పితే… తనదైన మార్కును మాత్రం వీడరని పార్టీ ఎమ్మెల్యేలు చెబుతుండటం గమనార్హం.