పవన్ సహనానికి ఫిదా కావాల్సిందే!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న విషయాలకే ఓ రేంజిలో రియాక్ట్ అయిపోతూ ఉంటారని… ఆయనలో సహనం పాళ్లు చాలా తక్కువనే విమర్శలు చాలా కాలం నుంచి ఉన్నవే. ఈ మాటలు నిజమేనన్నట్లుగా పవన్ చలా సందర్భాల్లో చిన్న విషయాలకు కూడా తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. ఆయా అంశాలపై ఊగిపోయారు. జన సైనికులను ఉర్రూతలూగించారు. అయితే పవన్ లో నిగూఢంగా సహనం దాగుందని…ఆ సహనం కూడా ఓ రేంజిలో టన్నుల కొద్దీ ఆయనలో ఉందని చెప్పక తప్పదు. అయితే మనిషి గుణంలో కోపం పెల్లుబికినంతగా సహనం వెంటనే బయటకు రాదు కదా. పవన్ విషయంలోనూ అదే జరిగింది. ఇటీవలి పరిణామాలను చూస్తుంటే… పవన్ లోని సహనానికి హాట్సాఫ్ చెప్పాల్సిందేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.

మొన్నటిదాకా అటు పార్టీ సమావేశాలతో పాటుగా డిప్యూటీ సీఎం హోదాలో ప్రభుత్వ పాలనలోనూ పవన్ యమా యాక్టివ్ గా కనిపించారు. అయితే ఉన్నట్టుండి మొన్నామధ్య ఆయన గాయబ్ అయిపోయారు. అమరావతిని నుండి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. ఇందుకు కారణం అనారోగ్యమేనని ఆ తర్వాత తెలిసింది. వెన్నునొప్పి కారణంగా పవన్ కొంతకాలం పాటు రెస్ట్ తీసుకున్నారు. అయితే అసలే రెండు కీలక బాధ్యతలు… ఆపై ఇంకెన్నాళ్లు రెస్ట్ తీసుకుంంటామన్న దిశగా కదిలిన పవన్… ఎప్పటినుంచో వాయిదా వేస్తూ వస్తున్న ధర్మ పరిరక్షణ యాత్రకు ఆయన ఆ అనారోగ్యంలోనే శ్రీకారం చుట్టారు. శరీరం సహకరించకున్నా కూడా ఆయన యాత్రను దిగ్విజయంగా పూర్తి చేశారు.

యాత్ర సందర్భంగా తన అనారోగ్యం, ఆ అనారోగ్యం వల్ల తాను పడుతున్న ఇబ్బందిని పవన్ స్వయంగానే వెల్లడించారు కూడా. యాత్ర తర్వాత కూడా చికిత్స తీసుకుందామనుకున్నా… పవన్ కు కుదరనట్టుంది. యాత్ర ముగిసిన వెంటనే మహాకుంభమేళాకు వెళ్లిన ఆయన పుణ్యస్నానం చేసి వచ్చారు. అలానే ఢిల్లీ సిఎం రేఖ గుప్త ప్రమాణ స్వీకరోత్సవానికి కూడా హాజరయ్యారు. ఆ వెంటనే అసెంబ్లీ సమావేశాలకు.. అది కూడా బడ్జెట్ సమావేశాలకు సమయం ఆసన్నమైంది. వీటికి గైర్హాజరు కాలేని పరిస్థితి. అంతే… ఇక కాస్త టైమ్ తీసుకుని అయినా చికిత్స తీసుకోవాల్సిందేనని పవన్ నిర్ణయించుకుని శనివారం రాత్రి హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రికి వెళ్లి ఆయన పలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వెన్నునొప్పి ఉపశమనానికి కొంత మేర వైద్యం కూడా చేయించుకున్నట్లుగా సమాచారం. మిగిలిపోయిన మరిన్ని వైద్య పరీక్షలను తర్వాత చేయించుకోవచ్చంటూ ఇంటికి వచ్చేశారు. ఆదివారం సాయంత్రానికే ఆయన అమరావతి వచ్చేస్తున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. అనారోగ్యంతో రెస్ట్ తీసుకుంటే… అదే అస్వస్థత కారణంగా మెట్టు దిగడం, ఎక్కడానికి ఇబ్బంది పడితే… రాజకీయ ప్రత్యర్థులు, ట్రోలర్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. టీడీపీతో జనసేనకు విభేదాలు వచ్చాయని… చంద్రబాబు ఫోన్ చేసినా పవన్ తీయట్లేదని…త్వరలోనే కూటమి నుంచి జనసేన బయటకు వస్తుందని లెక్కలేనంత మేర దుష్ప్రచారం జరిగింది. ఇక వెన్నునొప్పితో ఆయన కుంభమేళాలో మెట్టు దిగేందుకు ఇబ్బంది పడితే… పవన్ శారీరకంగా ఇంత బలహీనంగా ఉంటారా? అంటూ కొందరు నెటిజన్లు పవన్ ను అవహేళన చేశారు. ఇన్ని జరుగుతున్నా… పవన్ ఒక్కటంటే ఒక్క మాట కూడా అనకుండా తన పనేదో తాను చేసుకుంటూ వెళ్లిపోయిన తీరు… నిజంగానే పవన్ లోని సహనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందని చెప్పక తప్పదు.