ఇంకా నాలుగేళ్లకు పైగానే టైముంది గురూ…!

సోషల్ మీడియాలోకి గురువారం వచ్చి చేరిన ఓ ఫొటో పెద్దగా వైరలేమీ కాలేదు గానీ… దానిని చూసిన వారిలో మాత్రం అమితమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. సదరు ఫొటోలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని ఏవో వివరాలు చెబుతుంటే… ఆ పార్టీకి చెందిన ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కనక్నబాబు శ్రద్ధగా ఆ వివరాలను పెన్నుతో పేపర్ పైకి ఎక్కిస్తున్నారు. విశాఖలో ఈ ఫొటోను తీసినట్టుగా తెలుస్తోంది. ఇటీవలే హఠాన్మరణం చెందిన వైసీపీ నేత పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని పరమార్శించే నిమిత్తం జగన్ గురువారం పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే.

మన్యం జిల్లా పర్యటనలో భాగంగా జగన్ తో కన్నబాబు, గుడివాడ అమర్ నాథ్ తదితరులు కలిశారు. జగన్ అక్కడి నుంచి తిరిగి వెళ్లేదాకా వీరిద్దరూ జగన్ తో పాటే కొనసాగారు. మరో సీనియర్ నేత, శాసనమండలిలో విపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ అమరావతిలో ఉండాల్సి రావడంతో ఈ ఇద్దరు నేతలే జగన్ టూర్ ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ స్థితిగతులపై జగన్, కన్నబాబుల మధ్య చర్చ జరిగినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో తన వద్ద ఉన్న డేటాను జగన్…కన్నబాబుకు షేర్ చేసినట్టుగా తెలుస్తోంది. ఫలానా జిల్లాలో.. ఫలానా సమస్య, ఆ సమస్య పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలు… ఆయా నేతలు సృష్టిస్తున్న సమస్యలు… వారిని టాకిల్ చేయాల్సిన తీరు… ఇలా చాలా అంశాలపైనే వారిద్దరి మధ్య సుదీర్ఘంగానే చర్చ జరిగిందట.

ఈ సందర్భంగానే… జగన్ తన వద్ద ఉన్న ట్యాబ్ ను ఓపెన్ చేసి మరీ కన్నబాబుకు అందులోని వివరాలను చూపిస్తూ… వివరిస్తూ సాగారట. ఈ వివరాలను వింటూనే వాటిలో అవసరమైన వాటిని కన్నబాబు నోట్ చేసుకున్నట్లు సమాచారం. మొత్తంగా పార్టీ వ్యవహారాలపై జగన్ ఎంత కమిట్ మెంట్ తో ఉంటారన్న విషయం ఈ ఫొటోను చూస్తే అర్థం అవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు జగన్ కంటే కూడా కాస్తంత లోతుగానే పార్టీ పటిష్టతపై దృష్టి సారించే నేత కన్నబాబు రూపంలో జగన్ కు లభించారని.. ఈ క్రమంలోనే ఇతరత్రా వ్యవహారాలన్నీ పక్కనపెట్టేసిన ఆ నేతలిద్దరూ అలా పార్టీ వ్యవహారాలపై లోతుగా విశ్లేషించుకుంటూ… చర్చించుకుంటూ.. పరస్పరం సమాచారాన్ని షేర్ చేసుకుంటూ కనిపించారు. ఈ ఫొటోను చూసిన చాలా మంది ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లకు పైగానే సమయం ఉంది కదా… అప్పుడే ఇంత లోతుగా అధ్యయనం అవసరమా? అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.