దేశ రాజధాని ఢిల్లీకి కేంద్ర పాలిత ప్రాంత హోదా ఉన్నందున, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోలిస్తే ఇక్కడి సీఎంకు తక్కువ పరిమిత అధికారాలు ఉంటాయి. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 239AA ప్రకారం అమలు అవుతుంది. ఈ నిబంధనల ప్రకారం, ఢిల్లీకి శాసనసభ ఉన్నప్పటికీ, కొన్ని కీలక అధికారాలు కేంద్ర ప్రభుత్వమే నియంత్రిస్తుంది.
ప్రధానంగా, ఢిల్లీలోని భూమి పరిపాలన పూర్తిగా కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటుంది. భవన నిర్మాణం, ప్రభుత్వ భూముల కేటాయింపు వంటి కీలక నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేరు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ప్రభుత్వ హస్తక్షేపం చాలా పరిమితమవుతుంది.
దీనితోపాటు, పోలీస్ విభాగం కూడా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో సీఎంకు ప్రత్యక్ష అధికారాలు లేవు. ఎటువంటి అల్లర్లు, నేరాలు జరుగుతున్నా, పోలీసులు ముఖ్యమంత్రి ఆదేశాలను అనుసరించాల్సిన అవసరం లేదు. వీటిని లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) ద్వారా మాత్రమే కేంద్రం పర్యవేక్షిస్తుంది.
ఇక, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి రాదు. నగర అభివృద్ధి, రహదారి మరమ్మతులు, శుభ్రత వంటి సేవలపైనా రాష్ట్ర ప్రభుత్వానికి పరిమిత అధికారాలే ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తప్పనిసరి. ఎల్జీ ఎవరైనా నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపే హక్కు కూడా కలిగి ఉంటారు.
దీనివల్ల, కొత్తగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేఖా గుప్తాకు పూర్తిస్థాయి పరిపాలనాధికారాలు లభించవు. గతంలో అరవింద్ కేజ్రీవాల్, షీలా దీక్షిత్, మదన్ లాల్ ఖురానా వంటి ముఖ్యమంత్రులు కూడా పూర్తి రాష్ట్ర హోదా కోసం ప్రయత్నాలు చేశారు. కానీ, కేంద్ర ప్రభుత్వం ఈ అధికారాలను కట్టబెట్టకపోవడంతో, ఢిల్లీ సీఎం పదవి కేవలం పరిమిత శక్తులతోనే కొనసాగుతోంది.