దేశమంతా ఆసక్తి రేకెత్తించిన ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరన్న ఉత్కంఠను తెర పడిపోయింది. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఎంపికయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి సమవేశమైన బీజేఎల్పీ భేటీలో ఇటీవలి ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారంతా ఏకగ్రీవంగా రేఖా గుప్తాను సీఎంగా ఎన్నుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఢిల్లీలోని షాలిమార్ భాగ్ నియోజకవర్గం నుంచి గుప్తా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దాదాపుగా 15 రోజుల సుదీర్ఘ కసరత్తు తర్వాత రేఖాను బీజేపీ అధిష్ఠానం ఢిల్లీ సీఎంగా ఎంపిక చేయడం గమనార్హం.
ఇక న్యూఢిల్లీ స్థానం నుంచి బరిలోకి దిగి ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను మట్టి కరిపించిన బీజేపీ సీనియర్ నేత పర్వేశ్ వర్మకు డిప్యూటీ సీఎం పదవి దక్కింది. ఢిల్లీకి గతంలో బీజేపీ సీఎంగా పనిచేసిన సాహిబ్ సింగ్ వర్మ కుమారుడైన పర్వేశ్ కే సీఎం పోస్టు దక్కుతుందని అంతా భావించారు. ఆ మాట నిజమేనన్నట్లుగా ఎన్నికల ఫలితాలు విడుదలైన మరుక్షణమే వర్మ నేరుగా అమిత్ షా వద్దకు వెళ్లి ఆయనను కలిశారు. దీంతో ఢిల్తీ సీఎంగా పనిచేసిన వర్మ కుమారుడికే సీఎం పీఠం దక్కడం ఖాయమంటూ ఊహాగానాలు వినిపించాయి.
రేపు ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవంలో సీఎంగా రేఖా గుప్తా, డిప్యూటీ సీఎంగా పర్వేశ్ వర్మలతో పాటు ఆరుగురు మంత్రులు పదవీ ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. ఇక సీఎం పదవి కోసం గట్టిగానే యత్నించిన మరో బీజేపీ నేత విజయేంద్ర గుప్తాకు స్పీకర్ పదవి వరించబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం జరగనున్న ఢిల్లీ సీఎం పదవీ ప్రమాణానికి పీఎం మోదీతో పాటుగా బీజేపీ అగ్ర నేతలు, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుతో పాటు ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన కీలక నేతలంతా పాల్గొననున్నారు.