సీఈసీ ఎంపీకలో రాహుల్ మాట చెల్లలేదు!

సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, సీబీఐ డైరెక్టర్… ఈ మూడు పోస్టుల కంటే అత్యంత కీలకమైన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, కమిషనర్ల నియామకంలో ఓ సంప్రదాయం ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో పాటుగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ కూడా ఏకాభిప్రాయంతో ఈ ఎంపికలు జరిగితే బాగుంటుంది అన్నదే ఆ సంప్రదాయం. ఇందుకోసం ఈ పోస్టుల్లో పనిచేయాల్సిన అదికారుల కోసం హై లెవెల్ కమిటీ పేరిట ఓ కమిటీ ఉంటుంది. దానికి ప్రధాన మంత్రి నేతృత్వం వహిస్తే… అందులో కేంద్ర హోం శాఖ మంత్రితో పాటుగా లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉంటారు.

పై నాలుగు పోస్టుల భర్తీ విషయంలో ఈ కమిటీ భేటీ అయి నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ గా నిన్నటిదాకా కొనసాగిన రాజీవ్ కుమార్… మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. ఆ స్థానాన్ని భర్తీ చేసే విషయంలో సోమవారం రాత్రి హైలెవెల్ కమిటీ ప్రత్యేకంగా భేటీ అయ్యింది. మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీలతో కూడిన హై లెవెల్ కమిటీ భేటీ కాగా… ఓ అరగంట పాటు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఈసీగా ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘంలో కమిషనర్ గా పనిచేస్తున్న జ్ఞానేశ్ కుమార్ ను నియమిద్దామని మోదీ ప్రతిపాదించారు. అందుకు అమిత్ షా సరేనన్నా.. రాహుల్ మాత్రం ససేమిరా అన్నారట.

సీఈసీ నియామక ప్రక్రియకు సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకరోర్టులో ఉంది కదా… అది పూర్తి అయ్యాక ఎంపిక చేపదామని ప్రతిపాదించారట. అంతేకాకుండా ఆ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉండగా… సీఈసీ ఎంపికను చేపట్టేందుకు అసలు సమావేశం ఏర్పాటు చేయడమే సబబు కాదని కూడా ఆయన వాదించారట. ఈ క్రమంలో అరగంటలోనే సమావేశం ముగియగా…రాహుల్ విసవిసా వెళ్లిపోయారట. ఆ తర్వాత జ్ఞానేశ్ కుమార్ కు సీఈసీగా పదోన్నతి ఇస్తూ… ఆయన పదోన్నతితో ఖాళీ అయిన కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా వివేక్ జోషిని ఎంపిక చేశారు. ఈ నియామకాలకు అధికారులను ప్రతిపాదించగా… రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెనువెంటనే ఆమోద ముద్ర వేశారు. ఆ వెంటనే వీరి నియామకాలకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు జారీ అయిపోయాయి.

సీఈసీ ఎంపికకు సంబంధించిన ప్రక్రియ సుప్రీంకోర్టు పరిధిలో విచారణలో ఉన్నా… దానిపై కోర్టు ఏమీ స్పష్టమైన విధి విధానాలు జారీ చేయలేదు. అంతేకాకుండా ఈ వ్యవహారంపై తాము తీర్పు ఇచ్చేదాకా సీఈసీ నియామకాలు చేపట్టరాదని కూడా ఆదేశాలు ఏమీ జారీ చేయలేదు. సీఈసీ ఎంపికకు సంబంధించిన అభిప్రాయాన్ని చెప్పాలని కేంద్రాన్నికోరగా… ఇప్పటికే తన అభిప్రాయాన్ని కేంద్రం కోర్టుకు సమర్పించింది. ఈ లెక్కన సీఈసీ నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు ఆంక్షలేమీ లేవనే చెప్పాలి. అయితే దేశ అత్యున్నత స్థాయి పదవులు అయిన నేపథ్యంలో సీఈసీ లాంటి కీలక పదవుల భర్తీ విషయంలో ప్రధాన ప్రతిపక్షంతో కలిసి అధికార పక్షం నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయన్న వాదన అయితే బలంగా వినిపిస్తోంది. అయితే జ్ఞానేశ్ కుమార్ ఎంపిక విషయంలో మాత్రం అలా జరగకపోవడం గమనార్హం.