ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి మహానగరంగా నిర్మించాలని నిర్ణయించుకున్న సీఎం చంద్రబాబు.. ఆదిశగా వడి వడిగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రాజధాని ప్రాంతంలో రెండో దశ భూసమీకరణకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన జీవోను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. అయితే..దీనికి ముందు సీఎం చంద్రబాబు సంబంధిత రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ(సీఆర్ డీఏ) అధికారులతో సమావేశమయ్యారు. రైతులను మెప్పించి.. ఒప్పించాలని వారికి సూచించారు. రైతులను బెదిరించడం.. రైతులకు తెలియకుండా భూ సర్వేలు చేయడం వంటివి చేయరాదని తేల్చి చెప్పారు.
“విషయంపై ముందు మీరు అవగాహన పెంచుకోండి. రైతులకు నచ్చజెప్పండి. అవసరమైతే.. వారి ఇళ్లకు కూడా వెళ్లండి. రాజధాని మాస్టర్ ప్లాన్‌ను వారికి చూపించండి. ఈ విషయంలో నామోషీ వద్దు. వారితో కలిసి టీ తాగండి. వారితో మమేకం కండి. వారంతట వారే వచ్చి.. భూములు ఇచ్చేలా మీ చర్యలు ఉండాలి తప్ప.. నయానో భయానో బెదిరించి తీసుకునే కార్యక్రమాలు చేయొద్దు. ప్రతి విషయంలోనూ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడా చిన్న వివాదం, విమర్శ రావడానికి వీల్లేదు.“అని సీఆర్ డీఏ అధికారులకు చంద్రబాబు తేల్చి చెప్పారు. అనంతరం.. జీవో విడుదల చేశారు.
రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా ఇప్పటికే తొలి విడతలో రైతుల నుంచి 33 వేల ఎకరాలను తీసుకున్నారు. ఇక, రాజధాని విస్తరణను చేపట్టిన తర్వాత.. మరో 46 వేల ఎకరాలు అవసరం అయింది. దీనిలో తొలి విడతగా తాజాగా 16666 ఎకరాల భూమిని సమీకరించేందుకు(ల్యాండ్ పూలింగ్)ప్రభుత్వం నోటిఫికేషన్‌ను కొన్నాళ్ల కిందటే ఇచ్చింది. తాజాగా జీవోను విడుదల చేసింది. ఆయా ప్రాంతాల్లో ఎంతెంత భూమి అవసరమో.. తేల్చి చెప్పింది. దీనిని వివాదం చేయకుండా.. రైతులతో చక్కగా మాట్లాడి.. అమరావతికి వారు చేస్తున్న త్యాగాలను గుర్తు చేసి.. తీసుకోవాలని.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఎక్కడెక్కడ ఎంతెంత?
1) వైకుంఠపురం: 1,965 ఎకరాలు
2) పెద్దమద్దూరు: 1,018 ఎకరాలు
3) యండ్రాయి: 1,879 ఎకరాలు
4) కర్లపూడి: 2,603 ఎకరాలు
5) హరిశ్చంద్రపురం: 1,448.09 ఎకరాలు
6) పెదపరిమి: 5,886.18 ఎకరాలు
Gulte Telugu Telugu Political and Movie News Updates